+91 9182346178
2024 Telugu Rashi Phalalu (Rasi phalamulu)
ధనిష్టా 3, 4 పాదాలు (గు, గె)
శతభిషం 4 పాదాలు (గొ, స, సి, సు)
పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు (సె, సో, ద)
కుంభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా శని ఒకటవ ఇంటిలో, రాహు మీనరాశిలో రెండవ ఇంటిలో, కేతు కన్యరాశిలో ఎనిమిదవ ఇంటిలో సంచరిస్తారు. మే ఒకటి వరకు గురువు మేషరాశిలో మూడో ఇంటిలో సంచరిస్తాడు ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో నాలుగవ ఇంటిలో సంచరిస్తారు.
ఈ సంవత్సరం కుంభరాశి లో జన్మించిన వారికి వ్యాపార పరంగా మొదటి నాలుగు నెలలు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మిగిలిన సంవత్సరమంతా సామాన్య ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండటం వలన వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి ఏడవ ఇంటిపై, 9వ ఇంటిపై, మరియు 11 ఇంటిపై ఉండటం వలన వ్యాపారం అభివృద్ధి చెందటమే కాకుండా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కానీ, లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం కానీ చేస్తారు. ఇది పూర్తి అవటానికి ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారం కారణంగా ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో కానీ మీ వినియోగదారులతో కానీ కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోవడం కానీ లేదా మీ మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవడం కానీ జరగవచ్చు.
గురువు గోచారం మే ఒకటి నుంచి నాలుగవ ఇంటికి మారటంతో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములు అన్ని బాధ్యతలు మీపైనే పెట్టి వ్యాపారం విషయంలో ఎక్కువ పట్టించుకోకపోవడం, మరియు మీరు చెప్పే పనుల్ని వారు పెడచెవిన పెట్టడం వలన ఈ సమయంలో వ్యాపార పరంగా మీపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీరు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది. అయితే మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వ్యాపారం అభివృద్ధి చెందకపోవడం మరియు కొన్నిసార్లు నష్టాలు రావడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు మీ వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని తప్పుపట్టే అవకాశం ఉంటుంది. మీరు మీ బాధ్యతల్ని సరిగా నిర్వర్తించకపోవడం వల్లే వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని వారు మిమ్మల్ని బాధ్యుణ్ణి చేసే అవకాశం ఉంటుంది. దాని కారణంగా వారు వ్యాపారం నుంచి వైదొలగటం కానీ లేదా తమ వాటా డబ్బులో కొంత మొత్తం తిరిగి తీసుకోవడం కానీ చేస్తారు. దీని కారణంగా ఆర్థికంగా కూడా మీకు ఒత్తిడి పెరుగుతుంది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన వ్యాపార పరంగా ఇది అనుకూలించదు. శని దృష్టి ఏడవ ఇంటిపై మరియు పదవి ఇంటిపై ఉండటం వలన, మే నుంచి గురు దృష్టి ఏడవ ఇంటిపై లేకపోవడం వలన వ్యాపారం మందకొడిగా సాగుతుంది. గతంలో లాగా వ్యాపారం పూర్తిస్థాయిలో నడవకపోవడం వలన ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని తగ్గించుకోవడం కానీ లేదా మీ వ్యాపార శాఖలను తగ్గించుకోవడం కానీ చేస్తారు. ఈ సమయంలో మీ వినియోగదారులు లేదా వ్యాపార భాగస్వాముల కారణంగా న్యాయపరమైన లేదా ఆర్థికపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు వీలైనంతవరకు వచ్చిన సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించు కోవడానికి ప్రయత్నం చేయండి. అలా చేయకున్నట్లయితే మీకు అవి ఆర్థికపరమైన నష్టాలను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం రెండవ ఇంటిలో మరియు కేతు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన వ్యాపారంలో మరియు వ్యాపార కారకంగా వచ్చే ఆదాయంలో హెచ్చుతగ్గులుంటాయి. ఒక్కోసారి మంచి లాభాలు రావటం ఇంకోసారి నష్టాలు రావడం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యం కాదు. ముఖ్యంగా మే నుంచి గురు గోచారం మారడంతో మీ మాటలకు విలువ తగ్గటం, లేదా మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడినప్పటికీ ఎదుటివారి మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం జరగవచ్చు. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములతో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
కుంభ రాశిలో జన్మించిన ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండడం వలన ఈ సమయంలో ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిపే అవకాశం ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ, ఉద్యోగంలో కానీ మీ ప్రమేయం లేకుండా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అయితే మే వరకు గురువు గోచారం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జరిగే మార్పులు ఎక్కువగా ఇబ్బందికి గురి చేయవు. అయితే ఈ మార్పు ఆకస్మికంగా జరగడం వలన ఈ మార్పుకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఇది ఆర్థికంగా కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం నాలుగవ ఇంటికి మారటంతో ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నాలుగవ ఇంటిలో గురువు గోచారం కారణంగా మీరు వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయాల్సి రావటం కానీ లేదా ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలు స్వీకరించాల్సి రావటం కానీ జరుగుతుంది. దీని కారణంగా మీరు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది. ఈ మార్పు కారణంగా మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎంత శ్రమపడి పనిచేసినప్పటికీ మీ పై అధికారులు కానీ, మీ సహోద్యోగులు కానీ మీరు చేసిన పనిలో లోపాలను ఎత్తి చూపటం జరుగుతుంది. దీని కారణంగా మీకు రావలసిన గుర్తింపు రాకపోగా, మిమ్మల్ని నిరాశ నిస్పృహలకు గురిచేస్తుంది. గురు దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన కొన్నిసార్లు మీరు పేరు ప్రతిష్టల కొరకు మీకు సంబంధం లేని పనులను చేసే అవకాశం ఉంటుంది. దాని కారణంగా ఏ రకమైన ప్రయోజనం ఉండదు.
ఈ సంవత్సరం అంతా శని గోచారం 1వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొంతమంది మీ ఆలోచనలను, మీరు చేసే పనులను మధ్యలో ఆపటం కానీ లేదా వాటికి విలువ ఇవ్వకపోవడం కానీ చేస్తారు. అంతేకాకుండా మీరు చేసే పనులు మీకు తృప్తిని ఇవ్వకపోవడం వలన మీరు వాటిని పదేపదే చేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వృత్తిలో అనుకొని మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా మే 1 నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి మీరు ఆశించినట్టుగా ఉండవు కాబట్టి మీరు ఇష్టం లేకపోయినప్పటికీ వాటిని స్వీకరించాల్సి వస్తుంది. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారు, లేదా ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో ఎక్కువ ప్రయత్నం చేస్తే వారి ప్రయత్నం ఫలిస్తుంది. ఒకటవ ఇంటిలో సంచరించే శని మనలోని మానసిక లోపాల్ని సరిదిద్దడమే కాకుండా, మరియు మనకు నచ్చని పనులు కూడా ఇష్టంగా చేయాల్సిన అవసరాన్ని కల్పిస్తాడు. ఇది ఆ సమయంలో మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ భవిష్యత్తులో మీరు మీ వృత్తిలో ఎదగడానికి సహకరిస్తుంది. దీని కారణంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏకాగ్రతగా పనిచేయగలిగే శక్తిని సంపాదించుకోగలుగుతారు.
రెండవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీరు చెప్పే మాటకు, చేసే పనికి సంబంధం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు కేవలం మాటలు చెప్పే వారు తప్ప పనులు చేసే వారు కాదనే తప్పుడు అభిప్రాయం ఎదుటివారికి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేయాల్సిన లేదా చేస్తున్న పనులు ముందుగా ప్రకటించకుండా చేసుకుంటూ వెళ్లిపోవడం మంచిది. దాని వలన పనుల్లో ఆటంకాలు తగ్గటమే కాకుండా మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
కుంభ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి నాలుగు నెలలు అనుకూలంగా ఉంటుంది, మిగిలిన ఎనిమిది నెలలు సామాన్యంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురువు గోచారం మూడవ ఇంట్లో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉండటం, గురు దృష్టి 11 వ ఇంటిపై, మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. మీ వృత్తి ద్వారా కానీ లేదా వ్యాపారం ద్వారా కానీ అవసరమైనంత మేర ఆదాయం వస్తుంది. అంతే కాకుండా స్థిరాస్తుల అమ్మకం ద్వారా కానీ, లేదా అదనపు ఆదాయ వనరుల ద్వారా కానీ మీకు ఈ సమయంలో కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం నాలుగవ ఇంటికి మారటం వలన ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకుండా పోతుంది. మీరు పెట్టే ఖర్చులు పెరగడమే కాకుండా, ఇంట్లో శుభకార్యాలు లేదా, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. గురువు దృష్టి ఎనిమిదవ ఇంటిపై మరియు, 12వ ఇంటిపై ఉండటం వలన ఈ ఖర్చుల్లో ఎక్కువ శాతం ఉపయోగపడేవే అయినప్పటికీ మీకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవ్వటం వలన ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ముందుగానే పొదుపు ఎక్కువ చేయడం మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం చేయగలిగితే ఈ సమయంలో మీరు ఇతరుల ఆర్థిక సహాయం పొందే అవసరం లేకుండా ఖర్చు చేయగలుగుతారు.
ఈ సంవత్సరం అంతా ఒకటవ ఇంటిలో శని గోచారం కారణంగా ఆర్థికంగా కొన్నిసార్లు పరీక్షా సమయం గా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు పెట్టాలనుకునే దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన రావటం, ఎంత ప్రయత్నించినప్పటికీ ఆదాయం పెరగకపోవడం వలన ఈ సంవత్సరం డబ్బును సరైన విధంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే మీ బంధువుల నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ కొన్నిసార్లు అవసరమైన మేరకు డబ్బు అందే అవకాశం ఉంటుంది. అయితే కేవలం వారిపైనే ఆధారపడకుండా మీరు మీ ఆర్థిక వనరులను సరిగా వినియోగించుకోవడానికి ఈ సంవత్సరం ఎక్కువగా ఆర్థిక సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంటుంది. అవసరమైనప్పుడు డబ్బు చేతిలో ఉండకపోవటం, అవసరం లేనప్పుడు అవసరానికి మించిన డబ్బు దగ్గర ఉండటం ఈ సమయంలో సాధారణంగా జరుగుతుంది. అయితే మీరు ఆడంబరాలకు పోకుండా డబ్బును ముందుగానే పొదుపు చేయడం మరియు వీలైనంత తక్కువ ఖర్చు పెట్టడానికి ప్రయత్నించడం వలన మీరు ఈ సంవత్సరం ఆర్థిక సమస్యలు లేకుండా ఉండగలుగుతారు.
కుంభ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మొదటి నాలుగు నెలలు అనుకూలంగా ఉంటుంది మిగిలిన సమయం అంతా సామాన్యంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురు గోచారం మూడవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ లేదా, మీరు మీ బంధువుల ఇంటిలో శుభకార్యాలకి కుటుంబ సమేతంగా వెళ్లడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధ ప్రయాణాలు కానీ లేదా శుభకార్యాల నిమిత్తం జరిగే ప్రయాణాలు కానీ ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మరియు వారికి వారి వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి లభిస్తుంది. ఈ సమయంలో మీ తండ్రి గారి ఆరోగ్యం కానీ ఇంటిలో పెద్దవారి ఆరోగ్యం కానీ మెరుగుపడుతుంది. వారికి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటం వలన మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సమయంలో మీ మిత్రుల వల్ల కానీ, తోబుట్టువుల వల్ల కానీ మీకు ఆర్థికంగా లేదా కుటుంబ పరంగా అవసరానికి తగిన సహాయం అందుతుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం నాలుగవ ఇంటికి మారటం వలన కుటుంబ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటుంది. మీరు ఉద్యోగరీత్యా కాని, వ్యాపార రీత్యా కానీ, లేదా ఇతర వ్యక్తిగత కారణాలవల్ల కొంతకాలం మీ ఇంటికి దూరంగా ఉండవలసి రావచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడప లేక పోతారు. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులకు మీకు మనస్పర్ధలు ఏర్పడటం కానీ లేదా మీరు చెప్పే మాటల్ని వారు నమ్మకపోవడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో గురువు దృష్టి ఎనిమిదవ ఇంటిపై మరియు 12వ ఇంటిపై ఉండటం వలన, మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్య సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీరు లేదా మీ కుటుంబ సభ్యులు కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టవు కాబట్టి వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు మరియు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుంది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే ఒకటి నుంచి గురువు దృష్టి ఏడవ ఇంటిపై ఉండకపోవటం, కేవలం శని దృష్టి మాత్రమే ఏడవ ఇంటిపై ఉండటం వలన వారు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకపోవడం కానీ, లేదా మీపై మీ నడవడికపై అనుమానాలు వ్యక్తం చేయడం కానీ జరగవచ్చు. దాని కారణంగా కుటుంబంలో ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది. శని దృష్టి మూడవ ఇంటిపై కూడా ఉండటంతో మీ తోబుట్టువులతో కూడా మీకు సరైన అవగాహన ఉండకపోవటం కానీ లేదా స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి సమస్యలు ఏర్పడడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో కోర్టు వ్యవహారాలు కానీ లేదా న్యాయ సంబంధ వివాదాలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన కుటుంబంలో కొన్నిసార్లు ఆనందంగా మరికొన్నిసార్లు సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ మాట తీరువల్ల లేదా మీ ప్రవర్తన వల్ల మీ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు ప్రతిసారి ఏదో ఒక విషయంలో అబద్ధం ఆడటం కానీ లేదా మీరు నిజాయితీగా చెప్పినప్పటికీ ఎదుటివారు సరిగా అర్థం చేసుకోకపోవడం కానీ జరగవచ్చు. దాని కారణంగా మీ మాటపై మీ కుటుంబ సభ్యులకు నమ్మకం తప్పే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు వీలైనంతవరకు మాటలతో కాకుండా మీ పనుల ద్వారా మీ నిజాయితీని నిరూపించుకోవడం మంచిది.
కుంభరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే వరకు గురువు గోచారం మధ్యమంగా ఉండటం వలన ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవి తొందరగా నయం అవుతాయి కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గురువు దృష్టి 11 ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా నయం మాత్రమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.
మే 1 నుంచి గురువు గోచారం నాలుగవ ఇంటికి మారటం వలన ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. వెన్నెముక, కళ్ళు, జననాంగాలు మరియు కాలేయము సంబంధ ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండడమే కాకుండా, యోగ, ప్రాణాయామం, వ్యాయామం లాంటి వాటిని ప్రతిరోజూ చేయటం వలన మీరు ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉండదు. అయితే చాలావరకు ఈ సమస్యలు మీ నిర్లక్ష్యం కారణంగానే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ జీవిత విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవడం మంచిది. దీని కారణంగా ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా మీరు ఆరోగ్య సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. గురువు గోచారం అనుకూలంగా లేనప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రోగనిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవడం మరియు శారీరకంగా మరియు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండటానికి తగిన చర్యలు చేపట్టడం మంచిది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు ఎముకలు, చేతులు, చెవులు, మరియు మర్మావయవాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఈ సంవత్సరం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే 1 నుంచి గురువు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు పైన చెప్పిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒకటవ ఇంటిలో శని గోచారం మనలో బద్దకాన్ని, చాదస్థాన్ని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలా చేసుకోవడం మంచిది. దాని శని ప్రభావం తగ్గి మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం రెండవ ఇంటిలో, కేతు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయంలో మీరు తినే ఆహార విషయంలో నియమంగా ఉండటం మంచిది. రెండవ ఇంటిలో రాహు మిమ్మల్ని మసాలాలతో కూడిన ఆహారం, లేదా చిరుతిండ్లు ఎక్కువ తినేలా చేస్తాడు. అలాగే సమయం సందర్భం లేకుండా ఆహారం తీసుకునేలా చేస్తాడు కాబట్టి మీరు ఈ సంవత్సరం మీ భోజనం విషయంలో కచ్చితంగా ఒక క్రమశిక్షణతో ఉండటం మంచిది. లేకుంటే మీరు కడుపు, దంతాలు, మరియు మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురు గోచారం మూడవ ఇంటిలో ఉండటం వలన ఉన్నత విద్యకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న ఉన్నత విద్యాలయాల్లో, విద్యాసంస్థల్లో ప్రవేశం పొందగలుగుతారు. అలాగే విదేశాల్లో చదువుకోవాలని విద్యార్థులు కూడా అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ సమయంలో విద్యార్థులకు చదువు పరంగా ఆసక్తి తగ్గటం కానీ లేదా ఇతర విషయాలపై దృష్టి మరలటం కానీ జరుగుతుంది. దాని కారణంగా వారు పరీక్షా సమయంలో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. మే ఒకటి వరకు గురు దృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు 11 వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీరికి కొన్నిసార్లు ఎక్కువ శ్రద్ధగా చదవనప్పటికీ అనుకూలమైన ఫలితం వస్తుంది. కానీ ఇదేవిధంగా మే ఒకటి నుంచి వీరి ప్రవర్తన ఉన్నట్టయితే వీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోవడం కానీ లేదా తక్కువ మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడం కానీ జరుగుతుంది. దాని కారణంగా వారు అనుకున్న విధంగా భవిష్యత్తులో చదువు సాగకపోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చదువు విషయంలో నిర్లక్ష్య ధోరణి కానీ, అన్ని తెలుసు అని అహంకారం ఆలోచన కానీ విడిచిపెట్టి ఎక్కువ శ్రద్ధతో చదవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా గురువులతో కానీ, పెద్దవారితో కానీ వారు ఏదైనా సలహా చెప్పినప్పుడు, లేదా సూచన చేసినప్పుడు వితండవాదానికి దిగటం, లేదా వారు ఇచ్చే సలహా పెడచెవిన పెట్టడం చేస్తారు. దాని కారణంగా గురువుల, లేదా పెద్దవారి కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం ఒకటో ఇంటిలో ఉంటుంది కాబట్టి విద్యార్థుల్లో బద్ధకం గాని, చాదస్తం కానీ పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అతి స్వేచ్ఛ కూడా పెరగటం వలన వారు చదువు విషయంలో అంతా తమకే తెలుసునే ఆలోచన ధోరణి కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీరు ఊహల్లో కాకుండా ప్రత్యక్షంగా వారి చదువు కానీ, వారి ఆలోచన విధానం కానీ, ఇతరుల పట్ల వారి ప్రవర్తన కానీ ఏ విధంగా ఉందో గుర్తించగలిగితే వారు తమ తప్పు తెలుసుకొని తమను తాము సరైన మార్గంలో పెట్టుకోగలుగుతారు.
ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితం వచ్చినప్పటికీ వారు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫలితం పై దృష్టి పెట్టకుండా నిజాయితీగా వారు తమ చదువును కొనసాగిస్తే అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు. ఒక్కోసారి వారికి వారి లక్ష్యసాధనలో కొన్ని ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అది వారి కృషిలో లోపం ఉన్నదని తెలియజేసేవే తప్ప వారిని ఇబ్బంది పెట్టేవి కాదని గుర్తించగలిగితే వారు మరింత మెరుగ్గా తమ చదువు కొనసాగించగలుగుతారు మరియు ఉద్యోగాన్ని పొందగలుగుతారు.
కుంభరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం గురువుకు, శనికి, రాహువుకు, మరియు కేతువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. ఈ సంవత్సరం గురు గోచారం మూడు మరియు నాలుగవ ఇంట్లో ఉంటుంది కాబట్టి గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి గురువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికొరకు ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు మంత్ర జపం చేయటం లేదా గురు స్తోత్ర పారాయణం చేయటం మంచిది. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేయటం వలన కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. పైన చెప్పిన పరిహారాలతో పాటుగా విద్యార్థులకు వారి చదువుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, లేదా వారికి చదువు చెప్పటం, అలాగే గురువులను గౌరవించడం మొదలైనవి చేయటం వలన గురువు ప్రభావం తగ్గుతుంది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి, శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి శనికి పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం, శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. వీటితోపాటు హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్రం పారాయణం కానీ చేయటం మంచిది. దైవ సంబంధ పరిహారాలతో పాటుగా శని ప్రభావం తగ్గాలంటే వీలైనంతవరకు సేవ చేయడం మంచిది. శారీరక లోపాలున్న వారికి కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వలన కూడా శని ప్రభావం తగ్గుతుంది. శని మనలోని లోపాలని బయటపెట్టి వాటిని సరిదిద్దుకునేలా చేస్తాడు కాబట్టి శని ప్రభావము వలన వచ్చే సమస్యలను గురించి భయపడటంకంటే ఆ సమస్యకు కారణం ఏంటో కనుక్కోగలిగితే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.
ఈ సంవత్సరం అంతా రాహువు రెండవ ఇంటిలో సంచరిస్తాడు కాబట్టి, రాహువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి రాహువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు రాహు మంత్ర జపం చేయటం లేదా ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్రం కానీ దుర్గా స్తోత్రం కానీ చదవడం మంచిది. అంతేకాకుండా దుర్గా సప్తశతి పారాయణం చేయటం వలన కూడా రాహు ప్రభావం తగ్గుతుంది. రాహువు మనను ప్రలోభ పెట్టే గ్రహం కాబట్టి రాహు ప్రభావానికి లొంగకుండా ఉండటానికి పైన చెప్పిన స్తోత్రాలతో పాటుగా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా అహంకారానికి లోనుకాకుండా ఉండటం, ఇతరుల మాటలకు పొగడ్తలకు లొంగక పోవటం, ఆలోచన కంటే ఎక్కువ ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వటం చేస్తే మీరు రాహు ప్రభావం నుంచి బయట పడగలుగుతారు.
ఈ సంవత్సరమంతా కేతువు ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు కాబట్టి, కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికిగాను ప్రతి రోజు కాని, ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయటం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయడం మంచిది. దీనితోపాటు గణపతి స్తోత్ర పారాయణం కూడా చేయటం వలన కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది.
Donec id elit non mi porta gravida at eget metus. Donec id elit non Vestibulum id ligula porta felis euism od semper. Nulla vitae elit libero
Call Us +91 9182346178
Send an Email on bssharma02@gmail.com
LIG -16 Baharath nagar Colony, Moosapet ,
Kukatpally (M), Medchal(Dt), Malkajgiri,
Hyderabad- 500018
Morning : 8:30 AM to 10:30 AM
Evening : 4:00 PM to 8:00 PM