+91 9182346178
2024 Telugu Rashi Phalalu (Rasi phalamulu)
అశ్వని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా)
భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ, లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ)
మేషరాశి వారికి ఈ సంవత్సరమంతా శని పదకొండవ ఇల్లు అయిన కుంభ రాశిలో సంచరిస్తాడు, రాహువు మీనరాశిలో, పన్నెండవ ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో, 6వ ఇంటిలో సంచరిస్తారు. సంవత్సరారంభం నుంచి గురువు ఒకటవ ఇల్లు అయిన మేష రాశిలో సంచరిస్తాడు మరియు, మే ఒకటో తేదీన రెండవ ఇల్లు అయిన వృషభ రాశిలోకి మారతాడు.
వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురువు దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీరు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం ఆరంభించటం కానీ, కొత్త వ్యాపారం ఆరంభించటం కానీ చేస్తారు. మీరు వ్యాపారం చేసే ప్రదేశంతో పాటుగా, కొత్త ప్రాంతాల్లో వ్యాపార శాఖలను ప్రారంభించే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా గతంలో ఉన్న న్యాయ వివాదాలు కానీ, సమస్యలు కానీ, ఈ సంవత్సర ప్రథమార్థంలో తొలగిపోతాయి. మీ ఆలోచనలు సరైన ఫలితాలను ఇవ్వటం మరియు మీరు నిజాయితీగా ఉండటం వలన మీ వినియోగ దారుల నమ్మకాన్ని, వ్యాపారంలో విజయాన్ని పొందుతారు. అయితే ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో వచ్చిన లాభాలను పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు ఉపయోగించటం వలన ఈ సమయంలో మీరు ఎక్కువగా డబ్బు పొదుపు చేయలేక పోతారు. మే 1న గురువు, 2వ ఇల్లైన వృషభ రాశిలోకి మారటంతో వ్యాపార అభివృద్దితో పాటు, ఆర్థిక అభివృద్ధికూడా సాధ్యమవుతుంది. ఈ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధికి కావలసిన ఆర్థిక సహాయం అందుతుంది. అంతే కాకుండా గతంలో మీకు రావలసి ఉండి ఆగిపోయిన డబ్బు కానీ, లేదా మీరు గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బు కానీ రావటం వలన వ్యాపారంలో పెట్టుబడికి సాయపడుతుంది.
ఈ సంవత్సరమంతా రాహువు 12వ ఇంటిలో సంచరిస్తాడు. ఈ సంచారం కారణంగా మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కల్పించటానికి మరియు మీ గురించి, మీ వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేయటానికి కొంతమంది ప్రయత్నిస్తారు. మీ పక్కనే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేసే ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కానీ మీ నిజాయితీ, మరియు మీ తెలివి కారణంగా మీకు చెడు చేయాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలను మీరు అడ్డుకోగలుగుతారు. అయినా కూడా మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా పనిచేయటం మంచిది.
ఈ సంవత్సరమంతా శని లాభ స్థానంలో సంచరించటం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తున్నాయని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. మీ నిర్లక్ష్యం లేదా బద్ధకం మీరు నష్టపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అయ్యాక మీకు ఏల్నాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు పనికి ప్రాధాన్యత ఇవ్వటం అలవాటు చేసుకోండి.
ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ తర్వాత నుంచి చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఏప్రిల్ వరకు గురు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో ఉద్యోగం లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా విదేశాలకు కూడా వెళ్లడం జరుగుతుంది. అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన ఉద్యోగంలో వచ్చిన మార్పులు ఆనందాన్ని ఇవ్వకపోవడం జరుగుతుంది. అయితే సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ అసంతృప్తి అనేది కొంతకాలం వరకే ఉంటుంది ఆ తరువాత మీరు మీ ఉద్యోగాన్ని పూర్తిస్థాయి ఉత్సాహంతో చేయగలుగుతారు. మే నుంచి గురు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో పదోన్నతి లభించడం కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ జరుగుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి అవటం వలన ఉత్సాహంగా పదోన్నతి కారణంగా వచ్చిన బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ సమయంలో మీపై అధికారుల మద్దతు కూడా మీకు ఉంటుంది. అంతేకాకుండా మీ మాటకు విలువ పెరగటం, మీ కార్యాలయంలో మీ గౌరవ మర్యాదలు పెరగడం జరుగుతుంది. కొన్నిసార్లు మీరు చేపట్టిన బాధ్యతలను బద్దకం కారణంగా కానీ నిర్లక్ష్యం వల్ల కానీ పూర్తి చేయలేక పోతారు. దాని కారణంగా మీపై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీ తప్పులను తొందరగానే తెలుసుకొని సరిదిద్దుకుంటారు కాబట్టి ఈ సమస్య మీ వృత్తిపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. సంవత్సరం అంతా రాహువు గోచారం 12వ ఇంటిలో ఉండటం వలన మీరు రహస్య శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరం. మీరు సాధిస్తున్న విజయాల కారణంగా మీ సహ ఉద్యోగులు కానీ, ఇతరులు కానీ మీపై ఈర్ష కారణంగా మీ గురించి తప్పుడు ప్రచారాలు చేయడం కానీ లేదా మీ ఉద్యోగానికి హాని కలిగేలా ప్రవర్తించడం కానీ చేస్తారు. దీని కారణంగా అప్పుడప్పుడు మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సర ప్రథమార్థంలో ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు చెడు చేయాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలను మీరు విజయవంతంగా అడ్డుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ సమస్య కారణంగా మీ నిజాయితీ కానీ వృత్తిపట్ల నిబద్ధత కానీ మీ కార్యాలయంలో మరియు మీపై అధికారులకు తెలుస్తుంది.
లాభాధిపతి మరియు పదవ ఇంటి అధిపతి అయిన శని లాభ స్థానంలో ఈ సంవత్సరం అంతా సంచరించడం వలన మీకు వృత్తిలో విజయాలు లభిస్తాయి. మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా మీపై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. అయితే శని దృష్టి ఏప్రిల్ చివరి వరకు గురువు పై మరియు ఒకటవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు పని ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు పనులను వాయిదా వేయడం కానీ లేదా నిర్లక్ష్యంగా పూర్తి చేయడం కానీ చేస్తారు. అంతేకాకుండా పనులన్నీ తక్కువ శ్రమతో పూర్తి అవ్వడం వలన మీలో ఒకలాంటి అహంకారం కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ అహంకారమే మీకు శత్రువు గా మారే అవకాశం ఉంటుంది. 2025లో మీకు ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది కాబట్టి మీరు మీ పని విషయంలో ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అది మీకు ఏలినాటి శని సమయంలో మరింతగా చెడు చేసే అవకాశం ఉంటుంది. అలాగే 12వ ఇంటిలో రాహువు మానసిక ప్రశాంతతను కోల్పోయేలా చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసే ఆలోచనల విషయంలో కొన్నిసార్లు మీపై మీకే నమ్మకం కుదరక ఇబ్బంది పడతారు. దాని కారణంగా చేసిన పనులే మళ్ళీ, మళ్ళీ చేయడం కానీ లేదా వాయిదా వేయడం కానీ చేస్తుంటారు.
ఈ సంవత్సరం మే వరకు గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల నిమిత్తం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే మీ సంతానం విషయంలో తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ఈ సంవత్సరం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. అయితే సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి కారణంగా మరియు స్థిరాస్తుల కారణంగా ఈ సంవత్సరం మీ ఆదాయం పెరుగుతుంది. మే వరకు గురు దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు ఆర్థిక సహాయం అందడం కానీ, వారికి ఆర్థిక అభివృద్ధి జరగడం కానీ ఉంటుంది. సంవత్సరం అంతా రాహు గోచారం 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు గొప్పలకు పోయి అనవసర విషయాల మీద డబ్బు ఖర్చు చేస్తారు. అలాగే మీ తొందరపాటు కారణంగా నష్టం కలిగే వాటిపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ప్రథమార్ధంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి రావటం జరిగితే అనుభవజ్ఞుల లేదా మిత్రుల సలహా తీసుకొని పెట్టుబడి పెట్టడం మంచిది.
మే నుంచి గురువు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరగడమే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి. మీ పూర్వీకుల నుంచి వచ్చే వారసత్వ ఆస్తులు కానీ, వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన స్థిర చరాస్తులు కానీ ఈ సమయంలో మీకు అందుతాయి. లాభ స్థానంలో శని సంచారం కూడా మీకు ఆర్థికంగా అనుకూలించేలా చేస్తుంది. ముఖ్యంగా మీ వృత్తి వ్యాపారాల కారణంగా ఈ సంవత్సరం మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో చేసిన అప్పులు కానీ, తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు. ధన స్థానంలో గురు సంచారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి మంచి అవకాశాలు ఇస్తుంది. అయితే 12వ ఇంటిలో రాహు సంచారం కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుడు విషయాలలో పెట్టుబడి పెట్టడం కానీ అత్యాశకు పోయి లాటరీ లాంటి వాటిలో డబ్బులు పెట్టి నష్టపోయేలా చేస్తుంది. శని గోచారం అనుకూలంగా ఉన్నప్పుడు మన శ్రమతో సంపాదించే డబ్బుకు రెట్టింపు లాభాలు వస్తాయి. కష్టం లేకుండా డబ్బు రావాలని కోరుకునే అత్యాశ ఉంటే అంతకు రెట్టింపు నష్టాలను భరించాల్సి ఉంటుంది. ద్వితీయార్థంలో గురు దృష్టి పదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనులు మీకు డబ్బునే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా ఇస్తాయి.
ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు దృష్టి ఏడవ ఇంటిపై, ఐదవ ఇంటిపై మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన మీ కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా మీ పిల్లలకు, మీ జీవిత భాగస్వామికి, మరియు మీ ఇంట్లో పెద్దలకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. వారితో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఏప్రిల్ చివరి వరకు గురువు దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి వారు చేసే వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి పొందుతారు. అలాగే మీ పిల్లలకు కూడా వారి రంగంలో అభివృద్ధి పొందుతారు. మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి సహాయ సహకారాలతో మీరు ఈ సంవత్సరం కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో వారి సహకారం కారణంగా మీరు మీ లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారు. అష్టమ స్థానంపై శని దృష్టి కారణంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విలువైన వస్తువు కానీ డబ్బు కానీ ఈ సమయంలో నష్టపోయే అవకాశం కల్పిస్తున్నది కాబట్టి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.
మే ఒకటి నుంచి గురువు గోచారం రెండవ ఇంటిపై ఉండటం వలన మీ కుటుంబంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఒకవేళ మీరు వివాహం కొరకు గానీ సంతానం కొరకు గానీ ఎదురుచూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీ కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో మరియు సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే పనులు మరియు సహాయం కారణంగా ప్రజల అభిమానాన్ని పొందుతారు.
ఈ సంవత్సరం అంతా 12వ ఇంటిలో రాహు సంచారం కారణంగా కొన్నిసార్లు మీరు చెప్పుడు మాటలు విని కుటుంబ విషయాల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రథమార్థంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మీ ప్రవర్తన కారణంగా మీ కుటుంబ సభ్యులు మనస్థాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చెప్పుడు మాటలు వినడం కానీ, ఆవేశంగా ప్రవర్తించడం కానీ చేయకుండా విషయం ఏమిటనేది గ్రహించి దానికి అనుకూలంగా మసలుకోవటం మంచిది.
ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం మీ ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండటం, మే ఒకటి నుంచి గురువు గోచారం కూడా బాగుండటం వలన మీరు ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం ఆరోగ్యంగా ఉంటారు. సంవత్సర ఆరంభంలో గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం, మీ రాశిపై మరియు గురువు పై శని దృష్టి ఉండటం మరియు సంవత్సరమంతా 12వ ఇంటిలో రాహు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ప్రధమార్ధంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. ముఖ్యంగా మెడ, వెన్నెముక, ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా 12వ ఇంటిలో రాహు గోచారం కారణంగా మెడనొప్పి మరియు నిద్రలేమి కారణంగా మీరు శారీరకంగా మరియు మానసికంగా ఇబ్బందికి గురవుతారు. మీకు లేని ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు ఊహించుకొని భయాందోళనలకు లోనవుతారు. దీని కారణంగా మీరు నిద్రలేమి మరియు అజీర్ణ సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది.
ఒకటవ ఇంటిపై గురువు గోచారం కారణంగా కాలేయము మరియు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సర ఆరంభంలో కొంతకాలం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. అలాగే ఒకటవ ఇంటిపై, ఐదవ ఇంటిపై, మరియు ఎనిమిదవ ఇంటిపై శని దృష్టి కారణంగా ఎముకలు మరియు గుహ్యేంద్రియ సంబంధ ఆరోగ్య సమస్యలతో కొంతకాలం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో ఎక్కువ కాలం గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడగలరు. ఈ సంవత్సరం శారీరక సమస్యల కంటే మానసిక సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం. వీలైనంతవరకు మీ ఆలోచనలను తగ్గించుకొని ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకునేలా ప్రయత్నిస్తే మానసిక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకునేలా ప్రవర్తించడం, ఆవేశంగా మాట్లాడటం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాహువు మనలోని అహంకారాన్ని, అహంభావాన్ని పెంచే గ్రహం కాబట్టి రాహు గోచారం అనుకూలంగా లేని సమయంలో వీలైనంతవరకు వినయంగా ఉండటం అలాగే ఇతరులకు సాయం చేయడం వలన రాహువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గి మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. రాహు ప్రభావం తగ్గటానికి రాహువు కు పరిహారాలు చేయడం కూడా మంచిది.
విద్యార్థులకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో గురువు దృష్టి ఐదవ ఇంటిపై మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండటం, ద్వితీయార్థంలో గురువు గోచారం రెండవ ఇంటిపై సంచరించడం వలన వీరు చదువులో రాణించగలుగుతారు. మే ఒకటి వరకు గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి, పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని పట్టుదల పెరుగుతాయి. అంతేకాకుండా వీరు పడిన కష్టానికి ఫలితం కూడా లభిస్తుంది. గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన వారు అనుకున్న విద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే రాహు గోచారం అనుకూలంగా లేకపోవడం మరియు ఐదవ ఇంటిపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు తమ చదువు పట్ల, ఫలితాల పట్ల అహంకారానికి లోనై బద్దకాన్ని, నిర్లక్ష్యాన్ని అలవరచుకునే అవకాశం ఉంటుంది. అలా చేసేవారు వీటి ప్రభావం కారణంగా అనుకున్న ఫలితాన్ని సాధించలేక పోతారు. అయితే గురువు దృష్టి ప్రథమార్థంలో 9వ ఇంటిపై ఉండటం, ద్వితీయార్థంలో పదవ ఇంటిపై ఉండటం వలన గురువులు మరియు శ్రేయోభిలాషుల సలహాతో కానీ సాయంతో కానీ వారు తమ బద్దకాన్ని విడిచి పెట్టగలుగుతారు.
మే నుంచి గురువు గోచారం రెండవ ఇంటిలో అత్యంత అనుకూలంగా ఉండటం వలన విద్యార్థులకే కాకుండా ఉద్యోగార్థులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. వీరు చేసే ప్రయత్నాలు ఫలించి వీరు తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు. పదవ ఇంటిపై గురు దృష్టి కారణంగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు.
ఈ సంవత్సరం ముఖ్యంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సినది బద్దకాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టడం ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా తమ శ్రమను మాత్రమే నమ్మి ముందుకు సాగటం. ఎందుకంటే 12వ ఇంటిలో రాహు మిమ్మల్ని ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల విషయంలో మీరు తప్పు దోవలో పోయేలా మిమ్మల్ని ఇతరులు ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది. ఆ ప్రలోభాలకు నమ్మినట్లయితే మీ శ్రమ వ్యర్థం అవడమే కాకుండా మీరు అపకీర్తిని కూడా మూటకట్టుకునే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు మీ శ్రమకు, మీ ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వండి తప్ప ఇటువంటి సులభ మార్గాల విషయంలో ఇతరుల మాటలు నమ్మి మోసపోకండి.
ఈ సంవత్సరం మేష రాశి వారు ప్రధానంగా రాహువు కు పరిహారాలు ఆచరించడం మంచిది. సంవత్సరం అంతా రాహువు గోచారం 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడే అవకాశం ఉంటుంది. రాహు ఇచ్చే చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి రాహు మంత్ర జపం చేయటం లేదా ప్రతిరోజు రాహు స్తోత్రం కానీ దుర్గా స్తోత్రం కానీ చదవడం మంచిది. అంతేకాకుండా దుర్గా సప్తశతి పారాయణం చేయటం వలన కూడా రాహు ప్రభావం తగ్గుతుంది. రాహువు మనను ప్రలోభ పెట్టే గ్రహం కాబట్టి రాహు ప్రభావానికి లొంగకుండా ఉండటానికి పైన చెప్పిన స్తోత్రాలతో పాటుగా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా అహంకారానికి లోనుకాకుండా ఉండటం, ఇతరుల మాటలకు పొగడ్తలకు లొంగక పోవటం, ఆలోచన కంటే ఎక్కువ ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వటం చేస్తే మీరు రాహు ప్రభావం నుంచి బయట పడగలుగుతారు.
మే ఒకటి వరకు గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మరియు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. దీనికొరకు గురు మంత్ర జపం చేయటం లేదా గురు స్తోత్ర పారాయణం చేయటం మంచిది. . అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేయటం వలన కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. పైన చెప్పిన పరిహారాలతో పాటుగా విద్యార్థులకు వారి చదువుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అలాగే గురువులను గౌరవించడం చేయటం వలన గురువు ప్రభావం తగ్గుతుంది.
Donec id elit non mi porta gravida at eget metus. Donec id elit non Vestibulum id ligula porta felis euism od semper. Nulla vitae elit libero
Call Us +91 9182346178
Send an Email on bssharma02@gmail.com
LIG -16 Baharath nagar Colony, Moosapet ,
Kukatpally (M), Medchal(Dt), Malkajgiri,
Hyderabad- 500018
Morning : 8:30 AM to 10:30 AM
Evening : 4:00 PM to 8:00 PM