loader

Cancer / కర్కాటకరాశి

  • Home    >
  • Cancer / కర్కాటకరాశి

Minimum Registration Fee 300 / Rs Only, if u want any information pls contact this no + 91 9182346178 / కనీస రిజిస్ట్రేషన్ ఫీజు 300 / Rs మాత్రమే , మీకు ఏదైనా సమాచారం కావాలంటే దయచేసి ఈ నంబర్‌ను సంప్రదించండి + 91 9182346178

Cancer / కర్కాటకరాశి

కర్కాటక రాశిఫలములు 2024 సంవత్సర రాశిఫలములు

2024 Telugu Rashi Phalalu (Rasi phalamulu)

icons

పునర్వసు 4వ పాదము (హి)

పుష్యమి 1, 2, 3, పాదములు (హు, హె, హో, డా)

ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో)

2024 సంవత్సరములో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది.

ఈ సంవత్సరమంతా, శని కుంభ రాశిలో ఎనిమిదో ఇంట్లో, రాహువు మీన రాశి తొమ్మిదవ ఇంట్లో, మరియు కేతువు కన్యారాశిలో, 3వ ఇంటిలో సంచరిస్తారు. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేష రాశిలో పదవ ఇంట్లో సంచరిస్తాడు, మరియు మే 01 న, వృషభ రాశిలో పదకొండవ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు.

2024 సంవత్సరంలోకర్కాటక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది.

కర్కాటక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మే వరకు సామాన్యంగా మే నుంచి అత్యంత అనుకూలంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురువు గోచారం పదవ ఇంటిలో ఉండటం మరియు శని గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన వ్యాపారంలో పెద్దగా పురోగతి ఉండదు. వ్యాపార అభివృద్ధికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం వలన చాలాసార్లు నిరాశకు లోనవుతారు. అంతేకాకుండా మీరు చేసే ప్రయత్నాలను చులకనగా చూసేవారు, మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడే వారు ఎక్కువ అవ్వటం వలన మీరు చేసే ప్రయత్నాలు సరైనవో కావో అనే అనుమానానికి గురవుతారు. అయితే మీ రంగంలో అనుభవజ్ఞుల సహకారం లభించడం వలన ప్రయత్నాలు ఆపకుండా కొనసాగిస్తుంటారు. గురుదృష్టి మరియు శని దృష్టి రెండవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో వ్యాపార సంబంధ ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. దాని కారణంగా వ్యాపార అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడటానికి మీ ఆర్థిక పరిస్థితి కూడా ఒక కారణం అవుతుంది. ఈ సమయంలో నిరాశకులోను కాకుండా మీ ముందు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవడం మంచిది.

మే ఒకటి నుంచి గురువు గోచారం 11వ ఇంటికి మారడంతో పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. గత కొంతకాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి వ్యాపార అభివృద్ధికి మార్గాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో కానీ, కొత్త సంస్థలతో కానీ వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. దాని కారణంగా మీ వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభం అవుతుంది. గతంలో మిమ్మల్ని చులకన చేసిన వారు కూడా ఇప్పుడు మీ సహాయం కొరకు ఎదురు చూస్తారు. ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది వ్యాపార ఒప్పందాల కారణంగా, మరియు వ్యాపారం పెరగడం కారణంగా ఆదాయం పెరుగుతుంది. దాని వలన గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి తీర్చగలుగుతారు.

మీ ఆలోచనలు, మీ సృజనాత్మకత కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో మరింత ముందడుగు వేస్తారు. మీరు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ప్రదేశంతో పాటుగా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ఆరంభం చేస్తారు. ఈ సమయంలో తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అలాగే కొత్త ప్రాంతాల్లో వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి. కొన్నిసార్లు మీరు అటువంటి వ్యక్తుల కారణంగా మోసపోయే అవకాశం ఉంటుంది.

ఈ సంవత్సరం అంతా శని అష్టమ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీరు వ్యాపార లావాదేవీల్లో, మరియు వ్యాపార ఒప్పందాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తప్పుడు పత్రాలు కానీ, తప్పుడు వ్యక్తుల వల్ల కానీ మీ పేరు చెడిపోవడమే కాకుండా, నష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని విషయాలు గమనించి అవసరమైతే అనుభవజ్ఞుల లేదా శ్రేయోభిలాషుల సలహా తీసుకొని ముందుకు వెళ్లడం మంచిది.

2024 సంవత్సరంలోకర్కాటక రాశిలో జన్మించిన ఉద్యోగస్థులకు ఏ విధంగా ఉండబోతోంది.

కర్కాటక రాశిలో జన్మించిన ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురువు గోచారం పదవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో వృత్తిపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు దానిని ఓపికగా భరిస్తారు. అయితే పదవ ఇంటిపై శని దృష్టి కారణంగా వృత్తిలో అనుకోని మార్పులు రావటం కానీ లేదా మీరు ఎంత కష్టపడినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీ ఓపికను మరియు ఉద్యోగంలో మీ నిబద్ధతను పరీక్షించే సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు మీరు మీ పనిని నిజాయితీగా పూర్తి చేస్తే మీకు వచ్చే సమస్యల నుంచి బయట పడగలుగుతారు. దానివలన మిమ్మల్ని అవమాన పరచాలని లేదా ఇబ్బందులు పెట్టాలని అనుకునేవారు వెనక్కి తగ్గుతారు. ఈ సమయంలో ఆదాయం కూడా సామాన్యంగా ఉంటుంది. 9వ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీరు విదేశాలకు వెళ్లాల్సి రావడం కానీ లేదా వేరే ప్రదేశంలో కొంతకాలం పని చేయాల్సి కానీ రావచ్చు. లేదా మీ ఉద్యోగానికి సంబంధం లేని పనులు చేయాల్సి రావచ్చు. వీలైనంతవరకు నిరాశ చెందకుండా మీకు ఇచ్చిన పనిని పూర్తి చేయటం మంచిది. దాని వలన భవిష్యత్తులో మీ ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. పదవ ఇంటిలో గురువు కొన్నిసార్లు గొప్పలకు పోయి లేదా ఇతరుల మాటలకు లొంగిపోయి మీరు అదనపు బాధ్యతలు నెత్తిన వేసుకునేలా చేస్తాడు. కాబట్టి మీరు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఈ పనుల కారణంగా మీకు ఎలాంటి గుర్తింపు లభించదు పైగా చేయాల్సిన పనిని పూర్తి చేయకుంటే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది.

మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా మారటంతో వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గత సంవత్సర కాలంగా మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది. మీరు అనుకున్న పదోన్నతి కానీ లేదా మీరు అనుకున్న ప్రదేశానికి మారడం కానీ జరుగుతుంది. గతంలో మీకు చెడు చేయాలనుకున్నవారే ఇప్పుడు మీ సహాయం కోరి వస్తారు. పదవిలో అభివృద్ధి కారణంగా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. పని ఒత్తిడి కూడా తగ్గుతుంది. అయితే శని గోచారం సంవత్సరం అంతా అనుకూలంగా ఉండదు కాబట్టి కొన్నిసార్లు గతంలో చేసిన తప్పిదాలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే మీ పై అధికారుల సహాయంతో ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. గురువు దృష్టి అయిదవ ఇంటిపై ఉండటం వలన మీరు ఇచ్చే సలహాలు కానీ, సూచనలు కానీ మీరు పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఈ సమయంలో వచ్చే ఉద్యోగ అవకాశాల విషయంలో జాగ్రత్తగా ఉండి తొందరపడకుండా సరైన దానిని ఎంచుకోండి. ముఖ్యంగా ఇతరుల ప్రమేయం లేకుండా మీ సొంత ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం మంచిది.

మే నుంచి గురువు గోచారం అనుకూలంగా మారటం వలన ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లడానికి మంచి అవకాశాలు వస్తాయి. 9వ ఇంటిలో ఉన్న రాహువు కారణంగా కొన్ని అవకాశాలు మిమ్మల్ని ప్రలోభ పెట్టేవి గా ఉంటాయి కాబట్టి వాటిని అంగీకరించే ముందు అన్ని విధాలుగా పరిశీలించి ముందడుగు వేయడం మంచిది. ఈ సంవత్సరం అంతా కేతువు గోచారం మూడవ ఇంటిలో ఉండటం వలన మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మీకు ఉద్యోగ పరంగా మరియు ఆదాయపరంగా అభివృద్ధిని ఇస్తాయి.

సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీ వృత్తిలో మరియు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ఆటంకాలను పట్టించుకోకుండా మీరు పట్టుదలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు మీరు చేసే పనుల్లో ఏవైనా తప్పుడు దొర్లాయేమో అని మరి ఒకసారి పరిశీలన చేసుకొని ముందుకు వెళ్లడం మంచిది. ఎందుకంటే శని ఇచ్చే ఫలితం ఏదైనా ప్రారంభంలో ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ అది మన లోపాలను సవరించి మనలను మరింత రాటుదేలేలా చేస్తుంది. ముఖ్యంగా ఏ పని ప్రారంభిద్దామన్నా ఎవరో ఒకరు దానికి అడ్డు చెప్పడం కానీ మిమ్మల్ని నిరాశ పరచడం కానీ చేస్తారు ఇటువంటి సందర్భాలను మీరు మీ చిరునవ్వుతో జయించండి తప్ప వాటికి లొంగిపోకండి.

2024 సంవత్సరంలోకర్కాటక రాశిలో జన్మించిన వారి ఆర్థికస్థితి ఏ విధంగా ఉండబోతోంది.

ఈ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గత కొద్ది కాలంగా ఉన్న ఖర్చులు తగ్గుముఖం పడతాయి. మే వరకు గురు దృష్టి రెండవ ఇంటిపై, నాలుగవ ఇంటిపై, మరియు ఆరవ ఇంటిపై ఉండటం వలన ఆదాయంలో కొంత అభివృద్ధి జరుగుతుంది. అయితే ఈ సమయంలో వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు గాని అప్పులు గాని తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఈ సమయంలో స్థిరచరాస్తులు కొనుగోలు చేయడం అంతగా అనుకూలించే విషయం కాదు. ముఖ్యంగా శని దృష్టి ధనస్థానంపై మరియు ఐదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి పెట్టుబడులకు కానీ కొనుగోళ్లకు కానీ అంతగా అనుకూలించదు. ఒకవేళ ఏదైనా కొనాలనుకుంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే ఈ సమయంలో ఎక్కువ రిస్క్ తీసుకొని పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదు. మీకు వస్తున్న ఆదాయాన్ని వీలైనంతవరకు పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఈ డబ్బు భవిష్యత్తులో మీరు పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగపడుతుంది. శని దృష్టి పంచమ స్థానంపై ఉండటం వలన ఈ సమయంలో చాలావరకు నష్టం కలిగించే వాటిపైనే పెట్టుబడి పెట్టాలని చూస్తారు కాబట్టి తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సిన సందర్భాల్లో లేదా స్థిరాస్తులు కొనాల్సిన సందర్భాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకు వెళ్లడం మంచిది.

మే ఒకటి నుంచి గురువు గోచారం 11 వ ఇంట్లో ఉండటంతో ఆదాయం పెరగడంతో పాటుగా మీరు పెట్టుబడులు పెట్టడానికి స్థిరచరాస్తులు కొనుగోలు చేయడానికి అనుకూల సమయం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి. మీ ఆర్థిక సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి చెల్లించగలుగుతారు. గురు అనుగ్రహం వలన మీరు చిరకాలంగా కొనాలనుకుంటున్న ఇల్లు కానీ వాహనం కానీ ఈ సమయంలో కొనగలుగుతారు. ఉద్యోగం ద్వారా మరియు వ్యాపారం ద్వారా మీకు వచ్చే ఆదాయం ఈ సమయంలో పెరుగుతుంది. అయితే సంవత్సరం అంతా శని గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి వచ్చిన ఆదాయాన్ని సరైన విధంగా వినియోగించుకోకుంటే భవిష్యత్తులో మళ్లీ ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

2024 సంవత్సరంలోకర్కాటక రాశిలో జన్మించిన వారి కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతోంది.

కర్కాటక రాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే వరకు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీ నుంచి అత్యంత అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం పదవ ఇంటిలో ఉండటం మరియు శని దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారితో మనస్పర్ధలు పెరగటం అలాగే వారి నుంచి సరైన సహకారం లభించకపోవడం వలన మీరు చేయాల్సిన పనులు కొన్ని వాయిదా పడతాయి. దాని కారణంగా మీరు కొన్ని ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అయితే గురు దృష్టి కుటుంబ స్థానంపై మరియు గృహస్థానంపై ఉండటం వలన, ఈ మనస్పర్ధలు తొందరగానే సమసిపోయి వారి సహకారం మీకు అందుతుంది. 9వ ఇంటిపై రాహు సంచారం కారణంగా మీ తండ్రి గారి లేదా మీ ఇంటిలో పెద్దవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మూడో ఇంట్లో కేతు సంచారం మీ తోబుట్టిన వారి నుంచి మీకు సహకారం అందటం మరియు వారితో బాంధవ్యాలు మెరుగుపడటం జరుగుతుంది. అయితే మీరు కొంతకాలం మీ పిల్లలకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ దూరంగా ఉండవలసి రావటం కానీ, మీ పిల్లలు మీ అభిప్రాయాలను, ఆలోచనలను గౌరవించకపోవడం వలన వారితో మనస్పర్ధలు ఏర్పడడం గాని జరగవచ్చు.

మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా మారటంతో కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. మీ పిల్లలనుంచి గాని, మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ సంపూర్ణ సహకారం మీకు అందుతుంది. అంతేకాకుండా మీ పిల్లలు సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. మీ జీవిత భాగస్వామికి ఈ సమయంలో వృత్తిలో కానీ, వారు చేసే వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధ్యమవుతుంది. మీ మిత్రులు వల్ల, లేదా మీ బంధువుల వల్ల మీకు ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. దాని కారణంగా కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. శని దృష్టి సంవత్సరమంతా రెండవ ఇంటిపై ఉండటం వలన కొన్నిసార్లు మీరు అనాలోచితంగా మాట్లాడే మాటలు మీ కుటుంబ సభ్యుల మనసు నొప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఎదుటివారికి ఇబ్బంది కలిగేలా మాట్లాడకుండా ఉండటం మంచిది. అలాగే మీరు చెప్పిందే సరైనది అనే వాదన కూడా తగ్గించుకోవడం మంచిది.

లాభ స్థానంలో గురు సంచారం కారణంగా మీ దీర్ఘకాలిక కోరికల్లో చాలావరకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. అది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నూతన గృహం కానీ, వాహనం కానీ ఈ ఆనందానికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో వివాహం గురించి ఎదురుచూస్తున్న వారికి గాని, సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి కానీ అనుకూల ఫలితం లభిస్తుంది. వారి కోరికలు నెరవేరుతాయి.

2024 సంవత్సరంలోకర్కాటక రాశిలో జన్మించిన వారి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతోంది.

కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. మొదటి నాలుగు నెలలు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకుండా బాగుంటుంది. మే ఒకటి వరకు గురు గోచారం పదవ ఇంటిలో ఉండటం మరియు సంవత్సరం అంతా శని గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఎముకలు, కాలేయము, వెన్నెముక, మరియు జననేంద్రియ సంబంధ ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎనిమిదవ ఇంటిలో శని గోచారం కారణంగా ఎముకలు మరియు జననేంద్రియ సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ సమయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.

గురువు గోచారం పదవ ఇంటిలో ఉండే సమయంలో కాలేయము మరియు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. విశ్రాంతి లేకుండా పని చేయటం మరియు సమయానుకూలంగా భోజనం చేయకపోవడం, మరియు అలవాట్ల కారణంగా ఈ సమయంలో ఆరోగ్యము దెబ్బ తినే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి మరియు వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా మీరు కొన్నిసార్లు తిండికి నిద్రకు దూరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తగినంత విశ్రాంతికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అలాగే యోగా, ప్రాణాయామం లాంటి మానసిక శక్తిని పెంచే ప్రక్రియలను ఆచరించటం వలన కూడా ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో కూడా శనిగోచారం అనుకూలంగా లేనప్పటికీ 11 ఇంటిలో గురు గోచారం కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటం, మానసికంగా కూడా ఆనందంగా ఉండటం వలన మీ ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. గురువు దృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు అలాగే చిరుతిండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

అలాగే తొమ్మిదవ ఇంటిలో రాహు గోచారం ప్రత్యక్షంగా ఆరోగ్య సమస్యలు ఇవ్వనప్పటికీ పరోక్షంగా మీలో నిర్లక్ష్యాన్ని, వితండవాదాన్ని పెంచుతుంది. దాని కారణంగా ఇతరుల వద్దన్న పనులు చేయాలని కోరిక ఎక్కువవుతుంది. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ఇటువంటి నిర్లక్ష్య పూరిత ఆలోచన విధానం కారణంగా సమస్యల్ని కోరి తెచ్చుకున్న వారవుతారు.

2024 సంవత్సరంలోకర్కాటక రాశిలో జన్మించిన వారి చదువు ఏ విధంగా ఉండబోతోంది.

కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మొదటి నాలుగు నెలలు చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉండటం వలన చదువులో వారు అనుకున్న ఫలితాలను పొందుతారు. మే ఒకటి వరకు గురు గోచారం పదవ ఇంటిలో ఉండటం, సంవత్సరం అంతా శని దృష్టి రెండవ ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై ఉండటం వలన మొదటి నాలుగు నెలలు ఎంత చదివినప్పటికీ పరీక్షలలో అనుకున్న ఫలితం సాధించలేకపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో పరీక్షల విషయంలో విద్యార్థుల్లో ఒకలాంటి నిర్లక్ష్య ధోరణి ఏర్పడే అవకాశం ఉంటుంది. తాము బాగా చదివాం కాబట్టి పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతామని అహంకారపూరిత ధోరణి కారణంగా పరీక్షల సమయం వచ్చేసరికి వారిలో నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చదువుతోపాటుగా పరీక్షలు రాసే విధానంపై కూడా దృష్టి పెట్టి లోపాల్ని సవరించుకోవడం మంచిది.

మే ఒకటి నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చదువుపై శ్రద్ధ పెరగడమే కాకుండా గతంలో ఉన్న నిర్లక్ష్య ధోరణి తగ్గుతుంది. గురువు దృష్టి మూడవ ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై ఉండటం వలన వారిలో కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి మరియు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలనే పట్టుదల పెరుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో గురువుల మరియు అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు కూడా అందటం వలన వలన వారు పరీక్షలను సరిగా రాయగలుగుతారు.

తొమ్మిదవ ఇంటిలో రాహు గోచారం కారణంగా విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునేవారు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా సమాచార లోపం కారణంగా కానీ లేదా నిర్లక్ష్యం కారణంగా కానీ మీరు చేసే ప్రయత్నం ఫలించకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించి సమయం మించిపోక ముందే విద్యాసంస్థల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడం మంచిది.

ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మే ఒకటి నుంచి గురువు గోచారం లాభ స్థానంలో ఉండటం వలన వారి ప్రయత్నాలు ఫలించి వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది.

2024 సంవత్సరంలోకర్కాటక రాశిలో జన్మించిన వారు ఏ పరిహారాలు ఆచరించాలి

కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ప్రధానంగా శనికి పరిహారాలు చేయాలి. 8వ ఇంటిలో శని గోచారం కారణంగా వృత్తిలో, మరియు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి పరిహారాలు చేయడం వలన వృత్తి పరంగా మరియు ఆరోగ్యపరంగా అనుకూలంగా మారుతుంది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం, శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. వీటితోపాటు హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్రం పారాయణం కానీ చేయటం మంచిది. దైవ సంబంధ పరిహారాలతో పాటుగా శని ప్రభావం తగ్గాలంటే వీలైనంతవరకు సేవ చేయడం మంచిది. శారీరక లోపాలున్న వారికి కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వలన కూడా శని ప్రభావం తగ్గుతుంది. శని మనలోని లోపాలని బయటపెట్టి వాటిని సరిదిద్దుకునేలా చేస్తాడు కాబట్టి శని ప్రభావము వలన వచ్చే సమస్యలను గురించి భయపడటంకంటే ఆ సమస్యకు కారణం ఏంటో కనుక్కోగలిగితే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.

ఈ సంవత్సరం మే ఒకటి వరకు గురువు గోచారం పదవ ఇంటిలో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు స్తోత్ర పారాయణం చేయడం కానీ, గురు మంత్ర జపం చేయటం కానీ మంచిది. దీని వలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. వీటితోపాటు గురువులను, పెద్దలను గౌరవించడం, మరియు విద్యార్థులకు వారి చదువు ముందు సాగేలా వారికి తోచిన రూపంలో సాయం చేయడం మంచిది.

ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 9వ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే చెడు పలితాలు తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయటం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. దీనితోపాటు దుర్గా స్తోత్ర పారాయణం చేయటం లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయటం వలన కూడా రాహువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది.