+91 9182346178
2024 Telugu Rashi Phalalu (Rasi phalamulu)
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు (బో, జ, జి)
శ్రవణం 4 పాదాలు (జు, జే, జో, ఖ)
ధనిష్టా 1, 2 పాదాలు (గ, గి)
ఈ సంవత్సరం మకర రాశిలో జన్మించిన వారికి, సంవత్సరం అంతా శని కుంభరాశిలో, రెండవ ఇంట్లో, రాహు మీనరాశిలో, మూడవ ఇంట్లో, మరియు కేతు కన్య రాశిలో తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తారు. ఈ సంవత్సరం మే 1 వరకు గురువు మేషరాశిలో, 4 ఇంట్లో సంచరిస్తాడు, ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో, ఐదవ ఇంట్లో సంచరిస్తాడు.
మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొదటి నాలుగు నెలలు గురు గోచారం మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. వ్యాపారంలో పని ఎక్కువగా ఉండటం, చేసిన పనికి తగిన లాభాలు రాకపోవడం వలన కొంత ఇబ్బందికి గురి అవుతారు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావటం లేదా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావటం జరుగుతుంది. ఈ సమయంలో వ్యాపారానికి తగిన లాభాలు లేకపోవడంతో మీరు ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు చెప్పే మాటకి చేసే పనికి సంబంధం లేకపోవడం వలన మీ వినియోగదారులు కానీ, మీ వ్యాపార భాగస్వామిగాని మీ మాటపై నమ్మకం ఉంచకపోవడం జరుగుతుంది.
సంవత్సరం అంతా శని గోచారం రెండవ ఇంటిలో ఉండటం శని దృష్టి నాలుగో ఇంటిపై, ఎనిమిదో ఇంటిపై మరియు 11 ఇంటి పై ఉండటం వలన మీరు వ్యాపార అభివృద్ధి విషయంలో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములు మీకు సరైన సహాయం అందించకపోవడం, లేదా మీరు చేపట్టిన పనులు ఆలస్యం కావడం వలన మీరు చాలా సార్లు ఇచ్చిన మాట మాట నిలుపుకోలేక పోతారు. దాని కారణంగా ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చేయాలనుకున్న వ్యాపార ఒప్పందాలు వాయిదా పడడం లేదా ఆగిపోవడం జరపవచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి చాలా అడ్డంకులు ఎదురవుతాయి. అయితే నిరాశకు లోను కాకుండా నిజాయితీగా ప్రయత్నించినట్లయితే మీరు ఈ ఆటంకాలని తొలగించుకొని ముందడుగు వేయగలుగుతారు.
మే ఒకటి నుంచి గురు గోచారం ఐదవ ఇంటికి మారడంతో వ్యాపారంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవడం వలన మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోగలుగుతారు. విదేశాల నుంచి కానీ, అనుకోని వ్యక్తుల నుంచి కానీ పెట్టుబడులు కానీ, ఆర్థిక సాయం కాని ఈ సమయంలో అందే అవకాశం ఉంటుంది. గతంలో మీకు సహాయం చేయడానికి ముందుకు రాని వారు కూడా ఈ సమయంలో మీకు సహాయం చేయడం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు 11 ఇంటిపై ఉండటం వలన మీరు చేపట్టిన పనులు, చేసుకున్న ఒప్పందాలు మంచి లాభాలను ఇస్తాయి.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం మూడవ ఇంటిలో ఉండటం వలన మీరు ఆటంకాలు ఎదురైనప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు. మరియు ఎంత కష్టపడిన సరే అనుకున్న విధంగా వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని తపన, పట్టుదల మీలో పెరగటం వలన మీరు నిరంతరం శ్రమకూర్చి అనుకున్న లక్ష్యాలను చేరడానికి ప్రయత్నిస్తారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీరు చేసుకునే వ్యాపార ఒప్పందాలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తాయి. అలాగే ఈ సంవత్సరం వ్యాపారం చేసే ప్రదేశం లో మార్పు జరగడం కానీ, లేదా కొత్త ప్రదేశాల్లో మీ వ్యాపార శాఖలు ప్రారంభించడం కానీ చేస్తారు. దీనివలన మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందడం సాధ్యమవుతుంది.
మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురు గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం వలన మీరు మీ ఉద్యోగంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన రావడం వలన కానీ, లేదా మీకు కేటాయించిన పని ఎక్కువగా ఉండటం వల్ల కానీ ఈ సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా మీరు చాలా సార్లు అసహనానికి గురవుతారు. అంతేకాకుండా కొన్నిసార్లు మీరు నిజాయితీగా మీపై అధికారులు చెప్పిన పని చేయటం ప్రారంభించినప్పటికీ, అనుకోని సంఘటనల కారణంగా మీరు చెప్పిన సమయానికి పనులు పూర్తి చేయలేక పోతారు. దాని కారణంగా పై అధికారుల కోపానికి గురవటమే కాకుండా, వారి నమ్మకాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య దానంతటదే తొలగిపోతుంది కాబట్టి ఈ విషయంలో ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీరు వృత్తిలో మార్పు కొరకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సరైన ఫలితం రాకపోవడం వలన నిరాశకు లోన అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు రావలసిన పదోన్నతి కూడా వాయిదా పడటం కానీ లేదా అనుకున్న స్థాయిలో రాకపోవడం కానీ జరపవచ్చు.
మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా మారటం వలన వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు చెప్పిన సమయం కంటే ముందే పూర్తి చేయటం, మరియు మిగిలిన వారి కంటే ఉత్తమంగా పూర్తి చేయడం వలన మీరు మీ పై అధికారుల మెప్పును పొందుతారు. అంతేకాకుండా ఈ విషయంలో మీకున్న చెడ్డ పేరు కూడా తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం వల్ల మీ సహోద్యోగులు కానీ పై అధికారులు కానీ లాభపడతారు. దాని కారణంగా మీపై గౌరవం పెరగడమే కాకుండా అది భవిష్యత్తులో మీ వృత్తిలో అభివృద్ధికి సహకరిస్తుంది. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి కానీ, ఉద్యోగాల అభివృద్ధికి ప్రయత్నిస్తున్న వారికి కానీ ఈ సమయం అత్యంత అనుకూలిస్తుంది. వారి ప్రయత్నాలు ఫలించి వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.
ఈ సంవత్సరం అంతా శని గోచారం రెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఉద్యోగ పరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే వరకు గురువు గోచారం కూడా అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో ఈ సమయంలో ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడమే కాకుండా, ఉద్యోగంలో మీకు ఇబ్బందులు కలిగించాలని చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏదైనాప్పటికీ మీరు వాటికి నిరుత్సాహపడకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం వలన వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధంగా వచ్చే ఆటంకాలు మీరు చేసే పనుల్లో ఉన్న లోపాల్ని తగ్గించి ఆ పనిలో మిమ్మల్ని నిపుణులుగా మారుస్తాయి కాబట్టి ఆటంకాలు వస్తున్నాయని కుంగిపోయే అవసరం లేదు. శని దృష్టి నాలగవ ఇంటిపై, ఎనిమిదవ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండటం వలన మీరు కొన్నిసార్లు చేసే పనులకి అవమానాలు ఎదురవటం కానీ, మీరు చేసిన పనిని బట్టి ఎదుటివారు మిమ్మల్ని అంచనా వేయడం చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఫలితం గురించి ఆలోచించక నిజాయితీగా మీ పనుల్ని, మీ బాధ్యతలను పూర్తి చేయటం వలన భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం మూడవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనిచేయగలుగుతారు. అలాగే వివాదాల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ విజయం సాధిస్తారు. ముఖ్యంగా మే నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు మరింత ఉత్సాహంగా మీ ఉద్యోగ బాధ్యతల్ని పూర్తి చేయగలుగుతారు.
మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉంటుంది మిగిలిన సంవత్సరం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురువు గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం, శనిగోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. గురు దృష్టి ఎనిమిదవ ఇంటిపై మరియు 12వ ఇంటిపై ఉండటం వలన మీరు చెల్లించాల్సిన డబ్బులు ఆదాయం కంటే ఎక్కువ అవ్వటం, మరియు వృత్తి వ్యాపారంలో కూడా ఆదాయం పెరగకపోవడం వలన ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే మూడో ఇంటిలో రాహు గోచారం కారణంగా ఈ సమయంలో బంధువుల ద్వారా గాని పనిచేస్తున్న ద్వారా కానీ మీకు అవసరమైన డబ్బు చేతికందడం, లేదా స్థిరాస్తి అమ్మకాల ద్వారా కొంత డబ్బు రావడం వలన ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి.
సంవత్సరం అంతా శని గోచారం రెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి గురు బలం లేని సమయంలో ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. ఈ సమయంలో చాలాసార్లు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి వీలైనంతవరకు అనవసరమైన విషయాలపై డబ్బులు ఖర్చు చేయడం లేదా ఇతరుల ప్రలోభం కారణంగా నష్టపరిచే వాటిపై పెట్టుబడి పెట్టడం లాంటిది చేయకండి. ఈ సంవత్సరం ఎక్కువ డబ్బు ఇంట్లో శుభకార్యాల కొరకు, మరియు కుటుంబ ఆరోగ్య అవసరాల కొరకు ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం అంతా శని దృష్టి 11వ ఇంటిపై ఉండటం, మరియు శని స్థితి రెండవ ఇంటిలో ఉండటం వలన, ముఖ్యంగా మే ఒకటి వరకు గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అంతగా అనుకూలించదు. ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి వస్తే సూర్యుని గోచారం లేదా కుజుని గోచారం అనుకూలంగా ఉన్న సమయంలో పెట్టుబడి పెట్టడం కొంతవరకు మీరు నష్టపోకుండా కాపాడగలుగుతుంది.
ఈ సంవత్సరం మే 1 నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గురువు ఐదవ ఇంటికి మారడంతో మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు రావడమే కాకుండా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీ ఆదాయం పెరగటం వలన మీ ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. గురుదృష్టి 9వ, 11వ, మరియు ఒకటవ ఇండ్లపై ఉండటం వలన మీ ఆలోచన విధానంలో మార్పు రావటమే కాకుండా మీకు లాభం చేసే వాటిపై పెట్టుబడులు పెట్టడం అలాగే పెట్టుబడి పెట్టే ముందు సరైన విధంగా పరిశీలించి పెట్టడం చేస్తారు. దాని కారణంగా భవిష్యత్తులో నష్టాలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఈ సమయంలో మీ శ్రమకు అదృష్టం కూడా తోడవడం వలన మీరు స్థిర చరాస్తులు కూడా కొనుగోలు చేయగలుగుతారు. ముఖ్యంగా మీరు చాలా కాలం నుంచి కొనాలనుకున్న ఇల్లు కానీ, వాహనం కానీ ఈ సమయంలో కొనగలుగుతారు. అయితే సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు లేకుండా ఆచితూచి అడుగేయడం మంచిది.
మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురు గోచారం అనుకూలంగా లేకపోవడం మరియు సంవత్సరం అంతా శనిగోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఈ సంవత్సరం మే వరకు కుటుంబంలో ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నాలుగవ ఇంటిలో గురువు గోచారం కారణంగా బాధ్యతలు ఎక్కువ అవటం, దాని కారణంగా విశ్రాంతి లేకుండా పని చేయాల్సి రావటం వలన మానసికంగా ప్రశాంతత తగ్గిపోతుంది. . అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సరైన అవగాహన లేకపోవడం, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఎక్కువ అవ్వటం వలన మీరు అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీ పిల్లలు ఆరోగ్యం కానీ, వారి ప్రవర్తన కానీ మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంటుంది. మీరు ఎంత కష్టపడినప్పటికీ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని బాధ మీకు ఎక్కువ అవుతుంది. ఈ సమయంలో రెండవ ఇంటిలో శని గోచారం కూడా మీ సమస్యలకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ తగ్గటం లేదా మీరు చెప్పిన విషయాలు ఎదుటివారు అర్థం చేసుకోక మిమ్మల్ని తప్పు పట్టడం చేస్తారు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు మీ సమస్య అర్థమైనప్పటికీ వారు దానిని ఏ విధంగా సరి చేయాలో తెలుసుకోలేక పోతారు. ఈ సమయంలో మీరు అభిమానించే వ్యక్తులు కానీ, మీ దగ్గర బంధువులు కానీ మీ గురించి తప్పుగా ప్రచారం చేయడం కానీ లేదా మీరు అవమాన పడేలా మాట్లాడడం కానీ చేయవచ్చు. మీ ప్రమేయం లేకుండా జరిగే ఇలాంటి విషయాలను గురించి మీరు ఆందోళన చెందే అవసరం లేదు. ఈ సమస్యలు వాటంతట అవే దూరం అవుతాయి.
మే ఒకటి నుంచి గురు గోచారం ఐదవ ఇంటికి మారడంతో కుటుంబంలో మరియు వ్యక్తిగతంగా పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కాకుండా మీరు చేసే పనులకు వారి పూర్తి సహకారం అందిస్తారు. అంతేకాకుండా గతంలో మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు కూడా తమ తప్పు తెలుసుకుని మిమ్మల్ని క్షమాపణ వేడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిసి రావడంతో మీరు చేసిన ప్రతి పని మీకు మంచి పేరును మరియు లాభాన్ని ఇస్తుంది. అంతేకాకుండా సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.
ఈ సంవత్సరం అంతా రాహువు గోచారం మూడవ ఇంటిలో, కేతు గోచారం 9వ ఇంటిలో ఉండటం వలన మీరు కుటుంబ విషయాలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా మీ బాధ్యతలు నెరవేర్చగలుగుతారు. కొన్నిసార్లు కుటుంబ సమస్యల కారణంగా అసహనానికి, కోపానికి గురైనప్పటికీ మళ్లీ తొందరగానే మిమ్మల్ని మీరు సరి చేసుకోగలుగుతారు. మే ఒకటి వరకు గురు గోచారం అనుకూలంగా లేని సమయంలో, తొమ్మిదవ ఇంటిలో కేతు గోచారం కారణంగా మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, ఇంటిలో పెద్దవారు ఆరోగ్య విషయంగా కానీ కొంత ఆందోళనకు గురవుతారు. మే ఒకటి తర్వాత వారి ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి మీ మానసిక ఆందోళన తగ్గుతుంది.
మే ఒకటి నుంచి గురు గోచారం అనుకూలంగా మారడంతో ఇంటిలో శుభకార్యాలు జరగటం, ఒకవేళ సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే సంతానం అవ్వటం, వివాహితులకు వివాహం అవ్వటం ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంటుంది.
మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురుగోచారం నాలుగవ ఇంటిలో ఉండటం వలన మీరు ఊపిరితిత్తులు, వెన్నెముక మరియు కాలేయ సంబంధ అనారోగ్యాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వలన తొందరగా అలసిపోవడం మరియు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు కూడా నయం అవడానికి ఎక్కువ సమయం పట్టడం జరుగుతుంది. గురువుదృష్టి ఎనిమిదవ ఇంటిపై మరియు 12వ ఇంటిపై ఉండటం వలన మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే మీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. గురు గోచారం అనుకూలంగా లేని సమయంలో మీ ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం రెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి, దంతాలు, ఎముకలు, మరియు మర్మావయవాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ సంవత్సర ప్రథమార్థంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆరోగ్య సమస్యలు మొదటి నాలుగు నెలలు మాత్రమే ఎక్కువగా ఇబ్బంది పెడతాయి ఆ తర్వాత గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ఈ సంవత్సరం అంతా శని గోచారం రెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. శని గోచారం కారణంగా మీరు అపరిపక్వ భోజనం తీసుకోవడం కానీ లేదా చిరుతిండ్ల కారణంగా కానీ మీరు కడుపు మరియు దంతాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం, సంవత్సరం అంతా రాహువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటమే కాకుండా మానసికంగా మరియు శారీరకంగా మీరు దృఢంగా తయారవుతారు. మూడో ఇంటిలో రాహువు గోచారం కారణంగా మీ రోగ నిరోధక శక్తి మరియు మానసిక శక్తి ఎక్కువగా ఉండటం వలన మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగా బయటపడగలుగుతారు. మే ఒకటి నుంచి సంవత్సరం అంతా గురువు దృష్టి 11 ఇంటిపై మరియు ఒకటవ ఇంటిపై ఉండటం వలన మీరు ఆరోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడడమే కాకుండా తిరిగే ఆరోగ్య సమస్యలు రాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన కృషి చేస్తారు.
మకర రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు మిశ్రమ ఫలితాలను మిగిలిన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలను ఇస్తుంది. మే వరకు గురువు గోచారం నాలుగో ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో చదువుపై శ్రద్ధ తగ్గటం మరియు గురువులతో లేదా పెద్దవారితో వివాదాలకు దిగడం చేస్తారు. వారు చెప్పిందే లేదా వారు చేసిందే సరైనదనే వాదన చేస్తారు. దాని కారణంగా వీరికి చదువుపై శ్రద్ధ తగ్గడమే కాకుండా పరీక్షల్లో మార్కులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. గురువు దృష్టి ఎనిమిదవ ఇంటిపై, పదవ ఇంటిపై, మరియు 12వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో వారు చదువుకంటే ఎక్కువ పేరు ప్రతిష్టలపై దృష్టి పెట్టడం వలన వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించక అవమానాల పాలయ్యే అవకాశం ఉండటం లేదా వారు అనుకున్న కోర్సుల్లో ప్రవేశం పొందకపోవడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంతవరకు ఫలితం పై కాకుండా వారి శ్రమపై దృష్టి పెట్టడం మంచిది. అలాగే తమకు సాధ్యం కాని విషయాల గురించి ప్రగల్బాలు పలకడం కానీ, సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం కానీ చేయడం తగ్గించుకోవాల్సి ఉంటుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటంతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. గతంలో వారు చేసిన తప్పులు వారికి సరైన పాఠాలు నేర్పడంతో, భవిష్యత్తులో వారు ఇలాంటి తప్పులు చేయకుండా తమను తాము సరిదిద్దుకోగలుగుతారు. ఈ సమయంలో గురువుల మరియు శ్రేయోభిలాషుల సహకారం వీరికి ఉండటంతో తిరిగి చదువుపై పూర్తి దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవాలని, తమ తప్పులు సరిదిద్దుకోవాలని వారు నిరంతరం శ్రమిస్తారు. దీని కారణంగా వారు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవడమే కాకుండా వారు అనుకున్న విద్యాలయాల్లో ప్రవేశం పొందగలుగుతారు. ఈ సమయంలో విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి కూడా అనుకూల ఫలితం లభిస్తుంది
ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం మే నుంచి అనుకూలంగా ఉంటుంది. మొదటి నాలుగు నెలలు వారి ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కానప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడంతో వారు తామనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ముఖ్యంగా మే ఒకటి నుంచి గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటంతో వారిలో ఉత్సాహంతో పాటు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని తపన కూడా పెరుగుతుంది. దాని కొరకు నిరంతరం కృషి చేస్తారు వారు అనుకున్నది సాధిస్తారు. రెండవ ఇంటిలో శని గోచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి మాట విషయంలో మరియు పరీక్ష సమయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.
మకర రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం ప్రధానంగా శనికి మరియు గురువుకు పరిహారాలు చేయటం మంచిది. మే ఒకటి వరకు గురువు గోచారం నాలుగవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి గురువు పరిహారాలు చేయటం మంచిది. దీనికొరకు గురు మంత్ర జపం చేయటం లేదా గురు స్తోత్ర పారాయణం చేయటం మంచిది. . అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేయటం వలన కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. పైన చెప్పిన పరిహారాలతో పాటుగా విద్యార్థులకు వారి చదువుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అలాగే గురువులను గౌరవించడం చేయటం వలన గురువు ప్రభావం తగ్గుతుంది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం రెండవ ఇంటిలో ఉంటుంది కాబట్టి శని ఇచ్చే సమస్యలు తొలగిపోవడానికి శనికి పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం, శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. వీటితోపాటు హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్రం పారాయణం కానీ చేయటం మంచిది. దైవ సంబంధ పరిహారాలతో పాటుగా శని ప్రభావం తగ్గాలంటే వీలైనంతవరకు సేవ చేయడం మంచిది. శారీరక లోపాలున్న వారికి కానీ, అనాధలకు కానీ, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వలన కూడా శని ప్రభావం తగ్గుతుంది. శని మనలోని లోపాలని బయటపెట్టి వాటిని సరిదిద్దుకునేలా చేస్తాడు కాబట్టి శని ప్రభావము వలన వచ్చే సమస్యలను గురించి భయపడటం కంటే ఆ సమస్యకు కారణం ఏంటో కనుక్కోగలిగితే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.
Donec id elit non mi porta gravida at eget metus. Donec id elit non Vestibulum id ligula porta felis euism od semper. Nulla vitae elit libero
Call Us +91 9182346178
Send an Email on bssharma02@gmail.com
LIG -16 Baharath nagar Colony, Moosapet ,
Kukatpally (M), Medchal(Dt), Malkajgiri,
Hyderabad- 500018
Morning : 8:30 AM to 10:30 AM
Evening : 4:00 PM to 8:00 PM