loader

Gemini / మిధునరాశి

  • Home    >
  • Gemini / మిధునరాశి

Minimum Registration Fee 300 / Rs Only, if u want any information pls contact this no + 91 9182346178 / కనీస రిజిస్ట్రేషన్ ఫీజు 300 / Rs మాత్రమే , మీకు ఏదైనా సమాచారం కావాలంటే దయచేసి ఈ నంబర్‌ను సంప్రదించండి + 91 9182346178

Gemini / మిధునరాశి

మిథున రాశిఫలములు 2024 సంవత్సర రాశిఫలములు

2024 Telugu Rashi Phalalu (Rasi phalamulu)

icons

మృగశిర 3,4 పాదములు (కా,కి),

ఆరుద్ర 1,2,3,4 పాదములు(కు, ఘ, ఙ, ఛ)

పునర్వసు 1,2,3 పాదములు (కే,కో, హా)

2024 సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది.

ఈ సంవత్సరమంతా, శని కుంభ రాశిలో, తొమ్మిదవ ఇంట్లో మరియు రాహువు మీన రాశిలో పదవ ఇంట్లో సంచరిస్తారు. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేష రాశిలో పదకొండవ ఇంట్లో సంచరిస్తాడు మరియు మే 01 నుంచి, వృషభ రాశిలో, పన్నెండవ ఇంటిలో సంచరిస్తాడు.

2024 సంవత్సరంలో మిథున రాశి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది.

మిధున రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురు గోచారం 11వ ఇంటిలో ఉంటుంది కాబట్టి వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. గురు దృష్టి ఏడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు కొత్త వ్యాపారం కానీ లేదా కొత్త ప్రదేశంలో వ్యాపారం కానీ ప్రారంభం చేస్తారు. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీరు నిజాయితీగా చేసే వ్యాపారం మీకు పేరు ప్రఖ్యాతులతో పాటుగా మరింత మంది వినియోగదారులను ఇస్తుంది. మీరు చేసే ఆలోచనలు గాని పెట్టే పెట్టబడులు గాని మంచి ఫలితాలను ఇచ్చి ఆర్థికంగా మీరు అభివృద్ధి అవ్వడానికి దోహదపడతాయి. ఈ సంవత్సరం మీరు కొంత సాహసంతో చేసిన పనులు కూడా సత్ఫలితాలు ఇస్తాయి. ఈ సంవత్సరం ప్రధమార్ధంలో మీరు మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధిలోకి తేవడానికి మీ మిత్రులను లేదా పరిచయస్తులను మీ వ్యాపార భాగస్వాములుగా చేసుకుంటారు. ఇది ప్రారంభంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే పదవ ఇంటిలో రాహువు గోచారం కారణంగా మీరు ఎవరి మాట వినక మీ వ్యాపార విషయంలో కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. తొమ్మిదవ ఇంటిలో శని సంచారం కారణంగా మీకు వచ్చే లాభాల్లో ఎక్కువ భాగాన్ని పెట్టుబడులు పెట్టడానికి అలాగే విలాసాలకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.

మే ఒకటి నుంచి గురువు గోచారం 12వ ఇంటిలో ఉండటం వలన వ్యాపారంలో ఒకలాంటి స్తబ్దత ఏర్పడుతుంది. లాభాలు తగ్గటమే కాకుండా గతంలో తొందరపడి తీసుకునే నిర్ణయాల కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో నష్టాలు రావడం కానీ లేదా గతంలో ప్రారంభించిన వ్యాపార శాఖలు మూసివేయాల్సి రావటం కానీ జరగవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు గతంలో తీసుకున్న వ్యాపార సంబంధ లోన్లు కానీ, ఆర్థిక సహాయం కాని ఈ సమయంలో తిరిగి చెల్లించాల్సి రావచ్చు. దీని కారణంగా మీకు ఆర్థికంగా కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే 10 వ ఇంట్లో రాహు సంచారం వలన మీరు మీ ఉత్సాహం తగ్గకుండా పనులు చేసుకుంటూ వెళతారు. లాభాలు తగ్గినప్పటికీ వ్యాపారంలో మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. ఈ సమయంలో ఇతరుల మాటలకు లొంగి కొత్త పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. అంతేకాకుండా మీ భాగస్వాములతో కూడా వ్యాపార లావాదేవీలు సరైన విధంగా చేయటం, వారితో సత్సంబంధాలు కలిగి ఉండేలా చూసుకోవడం మంచిది. ముఖ్యంగా మీ దగ్గర పనిచేసే ఉద్యోగుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వారిని నిర్లక్ష్యం చేయడం వలన కానీ, ఇబ్బంది పెట్టడం వలన కానీ వారు ఆకస్మికంగా మీ దగ్గర ఉద్యోగం మానేసే అవకాశం ఉంటుంది. దాని వలన మీపై పని ఒత్తిడి పెరుగుతుంది. అలాగే కొత్త ఉద్యోగులు రావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.

ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీరు వ్యాపారంలో లాభాల కంటే ఎక్కువ నిజాయితీగా వ్యాపారం చేయడంపై దృష్టి పెట్టడం మంచిది. ఎందుకంటే కొంతమంది మీ పేరు చెడగొట్టడానికి లేదా వ్యాపారంలో నష్టాలు ఏర్పరచడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. వారు ప్రభుత్వానికి కానీ లేదా మీ శత్రువులకు కానీ మీ గురించి ఫిర్యాదు చేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకునేలా పనులు చేయటం చేయవచ్చు. మీరు ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా మీ వ్యాపారాన్ని నిజాయితీగా చేసినట్లయితే ఈ సమస్య నుంచి ఎటువంటి నష్టం లేకుండా బయట పడగలుగుతారు.

2024 సంవత్సరంలో మిథున రాశి ఉద్యోగస్థులకు ఏ విధంగా ఉండబోతోంది.

మిథున రాశిలో జన్మించిన ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా పదవ ఇంటిలో రాహువు, 11వ ఇంటిలో గురువు కారణంగా మీరు ధైర్యంగా చేసే పనులు విజయాన్ని ఇవ్వటమే కాకుండా మీ కార్యాలయంలో గుర్తింపును, పై అధికారుల ప్రశంసలను ఇస్తాయి. మిగతా వారు చేయలేకపోయిన పనులను మీరు చేయగలగటం, అలాగే మీరు చెప్పే సలహాలు, మీ ఆలోచనలు మీరు పని చేస్తున్న సంస్థకు ఉపయోగపడటం వలన ఈ సమయంలో మీకు పదోన్నతి కానీ ఆర్థిక అభివృద్ధి కానీ సాధ్యమవుతుంది. 9 వ ఇంట్లో శని సంచారం కారణంగా విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్ధంలో వారి ప్రయత్నాలు ఫలించి విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. అలాగే పనిచేస్తున్న చోట కాక వేరే చోటకు బదిలీపై వెళ్లాలనుకునే వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది.

మే ఒకటి నుంచి గురువు గోచారం 12వ ఇంటికి మారడంతో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. గతంలో మీరు చేసిన పనుల్లో విజయం సాధించడం వలన మీరు తప్ప ఆ పనులు వేరే ఎవరు చేయలేరనే అహంకార పూరిత ధోరణి అలబడుతుంది. సహోద్యోగులను చిన్న చూపు చూడటం, తక్కువ చేసి మాట్లాడటం వలన మీ కార్యాలయంలో మీకు శత్రువులు అధికమవుతారు. ప్రత్యక్షంగా మీకు చెడు చేయనప్పటికీ, పరోక్షంగా మీ గురించి మీపై అధికారులకు ఫిర్యాదు చేయడం చేస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో గతంలో లాగా చేపట్టిన పనుల్లో విజయం సాధించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కార్యాలయంలో ఎవరు కూడా మీకు సరైన సహకారం అందించకపోవడం వలన మీరు ఒంటరి అయ్యారనే భావన ఏర్పడుతుంది. మీలో ఉన్న పట్టుదల, ధైర్యము తగ్గటం, వాటి స్థానంలో అలాంటి భయం ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వీలైనంతవరకు మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. అలాగే గొప్పలకు పోయి ఇతరుల పనులను మీరు చేయటానికి ముందుకు వెళ్ళకండి. వీలైనంతవరకు మీ పనులను మీరు నిజాయితీగా, వినయంతో పూర్తిచేసే ప్రయత్నం చేయటం వలన ఇతరుల దృష్టిలో మీపై ఉన్న శత్రుభావన తగ్గే అవకాశం ఉంటుంది.

సంవత్సరం అంతా శని గోచారం 9వ ఇంటిలో ఉంటుంది, గురు బలం ఉన్నంతకాలం మీకు వృత్తిలో అభివృద్ధి ఉంటుంది కానీ గురు బలం తగ్గాక శని ఉద్యోగ విషయంలో అనుకోని మార్పులను ఇస్తాడు. మీకు ఇష్టం లేనప్పటికీ కొత్త ప్రదేశంలో నచ్చని వ్యక్తులతో పనిచేయాల్సి వస్తుంది అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. గతంలో మీకు చేదోడు, వాదోడుగా ఉన్న మీ సహోద్యోగులు వారు ఇచ్చే సహకారం ఈ సమయంలో అందించకుండా మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తారు. అలాగే రహస్య శత్రువుల కారణంగా కూడా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కుంటారు. అయితే గురువు గోచారం అనుకూలంగా లేనప్పటికీ పదవ ఇంటిలో రాహువు మీరు ధైర్యాన్ని కోల్పోకుండా కాపాడుతాడు. ఆరవ ఇంటిపై మరియు ఎనిమిదవ ఇంటిపై గురు దృష్టి ఉండటం వలన మీరు మీ ఉద్యోగంలో ఏర్పడే అవమానాలను కానీ, ఆటంకాలను కానీ తట్టుకొని విజయవంతంగా మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు.

2024 సంవత్సరంలో మిథున రాశి వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతోంది.

మిథున రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం లభించడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గురువు దృష్టి అయిదవ ఇంటిపై, మూడవ ఇంటిపై, మరియు ఏడవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో వ్యాపారం కారణంగా, మధ్యవర్తిత్వం కారణంగా మరియు షేర్ మార్కెట్ తదితరాల్లో పెట్టుబడుల కారణంగా ధనాదాయం పెరుగుతుంది. ఇల్లు, వాహనం లాంటి స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలనుకునేవారు మే 1 లోపు వాటిని కొనుగోలు చేయటం మంచిది. అలాగే వ్యాపారంలో కానీ, ఇతర అంశాలపై కానీ పెట్టుబడి పెట్టాలనుకునే వారు కూడా మే 1 లోపు ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవడం మంచిది.

మే నుంచి గురువు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరగడమే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి. మీ పూర్వీకుల నుంచి వచ్చే వారసత్వ ఆస్తులు కానీ, వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన స్థిర చరాస్తులు కానీ ఈ సమయంలో మీకు అందుతాయి. లాభ స్థానంలో శని సంచారం కూడా మీకు ఆర్థికంగా అనుకూలించేలా చేస్తుంది. ముఖ్యంగా మీ వృత్తి వ్యాపారాల కారణంగా ఈ సంవత్సరం మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో చేసిన అప్పులు కానీ, తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు. ధన స్థానంలో గురు సంచారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి మంచి అవకాశాలు ఇస్తుంది. అయితే 12వ ఇంటిలో రాహు సంచారం కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుడు విషయాలలో పెట్టుబడి పెట్టడం కానీ అత్యాశకు పోయి లాటరీ లాంటి వాటిలో డబ్బులు పెట్టి నష్టపోయేలా చేస్తుంది. శని గోచారం అనుకూలంగా ఉన్నప్పుడు మన శ్రమతో సంపాదించే డబ్బుకు రెట్టింపు లాభాలు వస్తాయి. కష్టం లేకుండా డబ్బు రావాలని కోరుకునే అత్యాశ ఉంటే అంతకు రెట్టింపు నష్టాలను భరించాల్సి ఉంటుంది. ద్వితీయార్థంలో గురు దృష్టి పదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనులు మీకు డబ్బునే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా ఇస్తాయి.

ఈ సంవత్సరం అంతా శనికి గోచారం 9వ ఇంటిలో ఉండటం వలన మీ ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో గురు గోచారం అనుకూలంగా లేకపోవడం, శని దృష్టి లాభ స్థానంపై మరియు ఆరవ ఇంటిపై ఉండటం వలన ఆదాయం తగ్గటం లేదా వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ, అప్పులు గాని తీర్చడానికి ఉపయోగించడం వలన ఈ సమయంలో మీరు డబ్బు పొదుపు చేయలేక పోతారు. కాబట్టి ఈ సంవత్సరంలో మీ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.

2024 సంవత్సరంలో మిథున రాశి వారి కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతోంది.

మిధున రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురువు గోచారం 11వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అంతేకాకుండా గతంలో ఉన్న సమస్యలు సమసి పోతాయి . గురువు దృష్టి ఐదవ ఇంటిపై, ఏడవ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన ఈ సంవత్సరం సంతానం కాని వారికి సంతానం అవుతుంది. చాలాకాలంగా వివాహం గురించి ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం వివాహ బలం ఉంటుంది. అలాగే విదేశీయనం కొరకు ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం వారి కోరిక తీరుతుంది. గురు దృష్టి మూడవ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టులతోటి మరియు బంధువులతోటి మీ సంబంధాలు మెరుగుపడతాయి.

ఈ సంవత్సరం అంతా శని గోచారం 9వ ఇంటిలో ఉండటం వలన ఇంటిలో పెద్దవారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మే ఒకటి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో పెద్దగా సమస్యలు లేనప్పటికీ మే 1 తర్వాత నుంచి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపించడం, మీ అహంభావం కారణంగా కుటుంబ సభ్యులను చులకనగా చూడటం వలన మనస్పర్ధలు ఏర్పడడం జరుగుతుంది. ఈ సమయంలో వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండటం అందర్నీ కలుపుకుపోయే ప్రయత్నం చేయటం మంచిది. అంతేకాకుండా మీ తొందరపాటుతనం కారణంగా మీరు చేసే పనులు మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకోండి .

ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వీటిలో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నాలుగవ ఇంటిలో కేతువు సంచారం కారణంగా మీకు మీ కుటుంబ సభ్యుల గురించి భయాందోళనలు ఎక్కువ అవుతాయి. వారి ఆరోగ్యం విషయంలో, వారి అవసరాల విషయంలో అతిగా కల్పించుకోవడం వలన వారు చిరాకుకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు వారికి సహాయం చేద్దామన్న చేయనీయటం లేదు అనే బాధ మీలో ఎక్కువవుతుంది. గురువు దృష్టి మే ఒకటి నుంచి నాలుగవ ఇంటిపై , ఆరవ ఇంటిపై మరియు ఎనిమిదవ ఇంటిపై ఉండటం వలన మీరు మీ జీవిత భాగస్వామి గురించి, మీ తల్లి గారి గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. అంతేకాకుండా వారికి ఏదో జరగబోతుంది అన్న మానసిక ఆందోళన మీలో ఎక్కువవుతుంది. నిజానికి వారికి ఏ సమస్య లేనప్పటికీ మీరు వారి గురించి అతిగా పట్టించుకోవడం వలన వారు చికాకుకు లోనవుతారు. ఈ సంవత్సరం మీరు ఇతరుల గురించి కానీ, మీ గురించి కానీ అతిగా ఆలోచించక వీలైనంతవరకు మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలా చేసుకుంటే ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం, మరియు మీ జీవితం బాగుంటుంది.

2024 సంవత్సరంలో మిథున రాశి వారి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతోంది.

మిథున రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మే వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మే ఒకటి నుంచి గురువు గోచారం 12వ ఇంటిలోకి మారుతుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం.

ఈ సంవత్సరం మే ఒకటి వరకు గురుగోచారం 11వ ఇంటిలో ఉండటం వలన మీ ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా గురువు దృష్టి పంచమ స్థానంపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తొందరగా నయమవుతాయి. ఈ సంవత్సరం అంతా శని గోచారం 9వ ఇంటిలో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. మే ఒకటి వరకు గురు గోచారం బాగుంటుంది కాబట్టి శని కూడా ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలను ఇవ్వడు. మే ఒకటి నుంచి గురువు గోచారం 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. కాలేయము, వెన్నెముక మరియు మూత్ర సంబంధ సమస్యలు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. గురువు గోచారం మే ఒకటి నుంచి అనుకూలంగా ఉండదు కాబట్టి మీలో రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. దాని కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తే ఎక్కువ కాలం బాధపడే అవకాశం కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది.

శని దృష్టి మూడవ ఇంటిపై, 11 వ ఇంటిపై ఉండటం వలన చేతులు లేదా చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యల వల్ల కూడా మీరు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బాధపడే అవకాశం ఉంటుంది. చాలావరకు ఈ సమస్యలు మీ నిర్లక్ష్యం కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ప్రయాణాల్లో ఆహారం తీసుకునేటప్పుడు మీరు రుచికంటే శుచిగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ జిహ్వచాపల్యం కారణంగా మీరు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సరైన విధంగా మీ శరీరానికి పని కల్పించుకుంటే కూడా మీరు ఎముకల సంబంధ సమస్యలు కానీ లేదా ఊబకాయాన్ని సంబంధించిన సమస్యలు కానీ ఈ సంవత్సరంలో ఎదుర్కోవాల్సి వస్తుంది.

నాలుగవ ఇంటిలో కేతు గోచారం కారణంగా మీరు మీ కుటుంబం గురించి ఎక్కువగా ఆందోళన చెంది మానసిక ఆరోగ్యం చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు యోగ ప్రాణాయామం లాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి మానసిక ఆందోళనలను తగ్గించుకోవటం మంచిది.

2024 సంవత్సరంలో మిథున రాశి వారి చదువు ఏ విధంగా ఉండబోతోంది.

మిథున రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత సమయంలో సాధారణ ఫలితాలను పొందుతారు. మే ఒకటి వరకు గురువు పదకొండవ ఇంటిలో ఉండటం వలన చదువులో బాగా రాణించడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఈ సమయంలో చదువుపై శ్రద్ధ పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి ఎక్కువ అవుతుంది. అలాగే పరీక్షల్లో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాలనే తపన ఎక్కువ అవటం వలన దాని కొరకు కష్టపడి చదువుతారు. వారి కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు.

తొమ్మిదవ ఇంటిలో శని గోచారం విదేశాల్లో ఉన్నత విద్యకు మార్గాలు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రథమార్ధంలో గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పదవ ఇంటిలో రాహు గోచారం కారణంగా వీరి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే నాలుగవ ఇంటిలో కేతువు కారణంగా వీరు చదువు పట్ల ఒకలాంటి భయాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ప్రాథమిక విద్యలో కొత్త ప్రదేశానికి చదువు నిమిత్తం వెళ్లే వారికి ఈ భయం ఎక్కువగా ఉంటుంది.

మే 1 నుంచి గురువు గోచారం 12 ఇంట్లో ఉండటం వలన వీరికి వీరి ప్రతిభ పట్ల అహంకారం కానీ, మిగతా వారి పట్ల చులకన భావం కానీ ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో చదువులో రాణించినప్పటికీ వారి అహంకారం కారణంగా పరీక్షల్లో సరైన మార్కులు రాకపోవడం కానీ, వారి నిర్లక్ష్యం కారణంగా వారు కోరుకున్న విద్యాలయాల్లో ప్రవేశం లభించకపోవడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంతవరకు సాధించిన విజయాల కంటే సాధించాల్సిన వాటి మీద దృష్టి పెట్టడం మంచిది. దాని వలన మీ ప్రతిభ మీతో పాటు నలుగురికి ఉపయోగపడుతుంది.

ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో అనుకూల ఫలితం లభిస్తుంది. ద్వితీయార్థంలో వీరు ఎక్కువగా శ్రమిస్తే కానీ సరైన ఫలితం లభించదు. కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులు నిర్లక్ష్యానికి తావివ్వకుండా, వచ్చిన విజయాలకు పొంగిపోకుండా చదువుపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

2024 సంవత్సరంలో మిథున రాశి వారు ఏ పరిహారాలు చేయాలి

మిథున రాశి వారు ఈ సంవత్సరం గురువుకు మరియు కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. మే ఒకటి నుంచి గురు గోచారం 12వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు కానీ, ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయటం మంచిది. దీంతోపాటు గురు చరిత్ర పారాయణం చేయటం వలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. గురువు అనుగ్రహం కొరకు పేద విద్యార్థులకు వారు చదువుకోడానికి తగిన సౌకర్యాలు అంటే వారికి అవసరమైన పుస్తకాలు కానీ, లేదా ఇతర చదువుకు సంబంధించిన సామాగ్రి కానీ ఇవ్వటం లేదా వారికి వీలున్నప్పుడల్లా ఉచితంగా విద్యా బోధన చేయడం వలన కూడా గురువు శుభ ఫలితాలు ఇస్తాడు.

ఈ సంవత్సరం అంతా కేతు గోచారం నాలుగవ ఇంటిలో ఉంటుంది కాబట్టి చదువు విషయంలో మరియు కుటుంబ విషయంలో వచ్చే సమస్యలు తొలగిపోవడానికి కేతువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికి గాను ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయటం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయడం మంచిది. దీనితోపాటు గణపతి స్తోత్ర పారాయణం కూడా చేయటం వలన కేతువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది.