+91 9182346178
2024 Telugu Rashi Phalalu (Rasi phalamulu)
మఖ 4 పాదాలు (మ, మి, ము, మే),
పుబ్బ 4 పాదాలు (మో, ట, టి, టు)
ఉత్తర 1వ పాదం (టె)
సింహరాశి వారికి ఈ సంవత్సరమంతా, శని కుంభ రాశిలో, ఏడవ ఇంట్లో, రాహువు మీన రాశిలో, ఎనిమిదో ఇంట్లో, మరియు కేతువు కన్యా రాశిలో 2వ ఇంట్లో సంచరిస్తారు. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేష రాశిలో, తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తాడు మరియు మే 01 నుంచి, వృషభ రాశిలో, పదవ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు.
సింహరాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంటిలో ఉండటం, రాహు గోచారం ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన వ్యాపారం కొంత మందకొడిగా సాగుతుంది. అయితే ఏప్రిల్ వరకు గురు గోచారం తొమ్మిదవ ఇంట్లో అనుకూలంగా ఉండటం వలన వ్యాపారం తక్కువ సాగినప్పటికీ ఆర్థికంగా అనుకూలంగా ఉండటం వలన పెద్దగా ఇబ్బంది పడే అవసరం ఉండదు. ఏడవ ఇంటిలో శనిగోచారం మరియు ఎనిమిదవ ఇంటిలో రాహువు గోచారం వలన వ్యాపార భాగస్వాములతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఏర్పడడం, మరియు మాట పట్టింపులు ఎక్కువ అవ్వటం వలన వ్యాపారం పైన దృష్టి తగ్గుతుంది
రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉన్నంతకాలం ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా వ్యాపార భాగస్వామితో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారి చర్యల కారణంగా లేదా వారి సహకారం సరిగా లేనందువలన ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తిగా కాకుండా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ప్రయంతించినప్పటికీ ఏదో ఒక కారణం చెప్పి వారు సరైన సహకారం అందించక తప్పించుకుని తిరిగే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు గొడవలకు పోకుండా సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవడం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులు తొలిగిపోతాయి.
ఏడవ ఇంటిలో శని గోచారం కారణంగా వినియోగదారులతో తరచుగా సమస్యలు రావడం కానీ లేదా వ్యాపార ఒప్పందాలు ఒక పట్టాన పూర్తి కాకపోవడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా వ్యాపార ప్రదేశంలో చేసిన మార్పులు కూడా ఒక రకంగా మీ ఇబ్బందికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో న్యాయ సంబంధమైన చిక్కులకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా పన్నులు కానీ ఇతర ప్రభుత్వ సంబంధ విషయాల్లో నిజాయితీగా ఉండటం వలన ఎటువంటి సమస్యలు లేకుండా వ్యాపారం చేసుకోగలుగుతారు.
గురువు గోచారం మే ఒకటి వరకు అనుకూలంగా ఉండటం వలన వ్యాపారంలో సమస్యలు వచ్చినప్పటికీ సమయానికి ఎవరో ఒకరి రూపంలో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ సమయం కొంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గతంలో చేసిన పెట్టుబడులు ఈ సమయంలో లాభాలను ఇవ్వటంతో ఆ డబ్బు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మే ఒకటి నుంచి గురువు గోచారం పదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపార విషయంలో కానీ, మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో కానీ కొంత జాగ్రత్త అవసరం అవుతుంది. ఉద్యోగుల సహకారం సరిగా అందకపోవటం లేదా వారు సమయానికి పని మానేయటం వలన కూడా మీరు ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకు ఒకరిపై ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోవడం వలన చాలావరకు వ్యాపార పరంగా ఉండే సమస్యల నుంచి బయట పడగలుగుతారు.
సింహరాశిలో జన్మించిన ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురు గోచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా చేసే పనులకు అదృష్టం కలిసి వచ్చి వృత్తిలో విజయం సాధిస్తారు. మీపై అధికారుల మెప్పును పొందుతారు. అంతేకాకుండా మీరు కోరుకున్న చోటికి బదిలీ అవ్వటం కానీ లేదా విదేశీ యానం చేయడం కానీ చేస్తారు. మీ ఆలోచనలు, మీ సృజనాత్మకత మీకు విజయాన్ని అందించడమే కాకుండా మీలో ఉన్న ప్రతిభను సమాజానికి చూపిస్తుంది. ఒకటవ ఇంటిపై గురు దృష్టి కారణంగా మీరు ఎంత శ్రమ అయినా ఓర్చుకొని ఉల్లాసంగా పని చేయగలుగుతారు. కొత్తగా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా చాలా కాలం నుంచి కోరుకున్న పదోన్నతి కూడా ఈ సమయంలో సాధ్యమవుతుంది
మే నుంచి గురువు గోచారం పదవ ఇంటికి మారడంతో వృత్తి పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పదోన్నతి కారణంగా మీరు క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సి రావటం, అలాగే గతంలో లాగా మీ సహోద్యోగుల సహకారం కూడా అందకపోవటం వలన మీరు ఒత్తిడికి లోన అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో గొప్పలకు పోయి మీకు సాధ్యం కాని పనులు చేయటానికి ప్రయత్నించకండి
ఈ సంవత్సరం అంతా శనిగోచారం ఏడవ ఇంటిలో ఉండటం వలన మీ వృత్తిలో కొన్నిసార్లు ఎక్కువ శ్రమకోర్చి పనిచేసినప్పటికీ తగిన గుర్తింపు లభించకపోవడం వలన మీరు నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే 1 నుంచి గురువు గోచారం పదవ ఇంటికి మారడంతో మీకు ఇతరుల నుంచి మీకు వృత్తి విషయంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గతంలో మీరు సులువుగా చేసిన పనులు కూడా ఇప్పుడు ఎవరి సహకారం లేకపోవడంతో కొంత ఇబ్బందితో పూర్తి చేయాల్సి వస్తుంది. శని దృష్టి ఒకటవ, 9వ మరియు నాలుగవ ఇంటిపై ఉండటం వలన మీకు చేసే పనుల విషయంలో అదృష్టం కంటే ఎక్కువగా శ్రమను నమ్ముకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరి సహాయం లేకుండా చేయడానికి ప్రయత్నించడం మంచిది. ఒకవేళ ఎవరైనా సహాయం చేసిన తర్వాత ఆ పని గొప్పతనాన్ని మీకు సహాయం చేసిన వ్యక్తులు ఆపాదించుకునే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీకు రావాల్సిన గుర్తింపు రాకుండా పోతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేపట్టిన పనులను చెడగొట్టడానికి, లేదా మీ వచ్చిన అవకాశాలను పోగొట్టడానికి సహోద్యోగులు కానీ ఇతరులు కానీ ప్రయత్నించే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అలాగే పని విషయంలో గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టడం మంచిది.
ఎనిమిదవ ఇంటిలో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు చేయని తప్పులకు కూడా మీరు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. అంతేకాకుండా వీలైనంతవరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకోవడం వలన ఈ సంవత్సరం ఉద్యోగ విషయంలో ఎక్కువ సమస్యలు లేకుండా గడిచిపోతుంది. ఈ సమయం మీ సహనాన్ని పరీక్షించడానికి మరియు మీలో ఉన్న లోపాల్ని సవరించుకోడానికి మంచి సమయంగా గుర్తించండి. వచ్చిన సమస్యలను సరిగా అర్థం చేసుకుంటే మీరు వాటిని జయించవచ్చు.
ఈ సంవత్సరం సింహ రాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరగటం వలన స్థిరాస్తి కొనుగోళ్లు చేస్తారు. తొమ్మిదవ ఇంటిలో గురువు గోచారం కారణంగా చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిసి వచ్చి ఆదాయం పెరుగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితి మే ఒకటి వరకే ఉంటుంది కాబట్టి, కేవలం అదృష్టం మీదనే ఆధారపడటం మంచిది కాదు. ఐదవ ఇంటి అధిపతి అయిన గురువు తొమ్మిదవ ఇంటిలో సంచరించటం వలన మరియు గురువు దృష్టి ఒకటి, మూడు, మరియు ఐదవ ఇంటిపై ఉండటం వలన మీ ఆలోచనలు, మరియు మీ పెట్టుబడులు సరైన మార్గంలో వెళ్ళటం వలన డబ్బు రాబడి పెరుగుతుంది. అంతేకాకుండా మీ పూర్వీకుల ఆస్తులు కానీ, వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన ఆస్తులు కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో ఇచ్చి ఎంత కాలం అయినప్పటికీ తిరిగి రాని డబ్బు కూడా ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం పదవ ఇంటికి మారుతుంది. గురు దృష్టి ధనస్థానంపై ఉన్నప్పటికీ వచ్చే ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. గతంలో చేసిన అప్పులు కానీ, లోన్లు కానీ తిరిగి తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం ఉన్నప్పటికీ డబ్బు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి కారణంగా గతంలో లాగా ఎక్కువగా పొదుపు చేయలేరు. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకటో ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై శని దృష్టి కారణంగా తొందరపడి పెట్టే పెట్టుబడులు నష్టాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్బు ఎక్కువ వస్తుందని ఉద్దేశంతో రిస్కు తీసుకొని పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో అస్సలు పనికిరాదు.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఇది ఖర్చులను పెంచుతుంది. ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చాలాసార్లు గొప్పలకు పోయి మీ శక్తికి మించిన ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ నిర్లక్ష్యం కారణంగా లేదా ఇతరులు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టడం వలన ఈ విధంగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు డబ్బు అందుబాటులో ఉంచుకోకండి అలా ఉంచుకున్నట్లయితే ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు డబ్బు కానీ విలువైన వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాల్లో విలువైన వస్తువులు ఆభరణాలు జాగ్రత్త చేసుకోవడం కానీ వాటిని వెంట తీసుకుపోకుండా ఉండడం కానీ చేయటం మంచిది.
సింహరాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. మే ఒకటి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి జరగడం కానీ, లేదా గతంలో మనస్పర్ధలు ఏర్పడిన కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత ఏర్పడడం కానీ జరుగుతుంది . గురువు దృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ సంతానం వారి రంగాల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా మీ తోబుట్టులతో సఖ్యత పెరుగుతుంది మరియు వారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.
ఈ సంవత్సరం శని గోచారం ఏడవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అవగాహన లోపించడం దాని కారణంగా ఒకరి లోపాలు ఒకరు ఎత్తిచూపుకోవటం చేస్తుంటారు. అంతేకాకుండా మీరు చెప్పే వాటికి వితండవాదం చేయటం మరియు చేయాల్సిన పనులను వాయిదా వేస్తూ ఉండటం వలన మీలో అసహనం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండటం, ఏవైనా గొడవలు జరిగినప్పుడు దానిని పెంచుకోకుండా తక్కువగా మాట్లాడటం మరియు గొడవలు సమస్య పోవడానికి పెద్దవారి సహకారం తీసుకోవడం మంచిది. మే వరకు గురు గోచారము అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ సామరస్య పూర్వంగా పరిష్కరించుకో గలుగుతారు. మే ఒకటి నుంచి గురువు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన కుటుంబంలో వృద్ధి ఏర్పడుతుంది. ఈ సమయంలో శని దృష్టి మరియు గురువు దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వలన ఇంటిలో సమస్యలు రావడం కానీ లేదా మీరు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాల్సి రావడం కానీ జరుగుతుంది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో, కేతువు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన ఈ సంవత్సరం మీ ఇంటిలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే మే వరకు గురు గోచారం 9వ ఇంటిలో ఉండటం, మే 1 నుంచి గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన వారి ఆరోగ్యం తొందరగానే బాగుపడుతుంది. ఈ సంవత్సరం శని మరియు రాహువులు అనుకూలంగా ఉండరు కాబట్టి వీలైనంతవరకు కుటుంబ సభ్యులతో సమస్యలను పెంచుకోకుండా సామరస్య పూర్వకంగా ఉండటం మంచిది.
సింహరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే వరకు గురు దృష్టి ఒకటవ ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు ఉత్సాహంగా మీ పనులను చేసుకోగలుగుతారు.
ఈ సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంటిలో ఉండటం వలన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. మే వరకు ఆరోగ్యం బాగున్నప్పటికీ మే నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఏడవ ఇంట్లో శని కారణంగా ఎముకలు, కిడ్నీలు, మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో బద్ధకానికి తావివ్వకుండా మీరు వ్యాయామము, నడక లాంటి అలవాట్లను అలవరచుకోవాల్సి ఉంటుంది. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవడం మంచిది. శని దృష్టి ఒకటవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మానసికంగా ఏదో ఒక చికాకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచించడం, మరియు వారి సమస్యలను మీపై వేసుకోవడం వలన ఈ రకమైన చికాకులు మరియు మానసిక ఆందోళన ఈ సమయంలో ఎక్కువ అవుతుంది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఎనిమిది ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు మరియు విష జ్వరములు లేదా ఎలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే మే ఒకటి వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువగా ఉండవు. అయితే మే ఒకటి గురువు గోచారం పదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తీసుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం అంతా మీరు మీ భోజనం విషయంలో మరియు విశ్రాంతి విషయంలో సరైన శ్రద్ధ పెట్టకుంటే రోగాల బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండండి మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోవడం మరియు ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలా చూసుకోవటం వలన ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుంది. వారు అనుకున్న విద్యాలయాల్లో ప్రవేశం పొందడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. గురువు దృష్టి ఒకటవ ఇంటిపై, మూడవ ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై ఉండటం వలన వారికి చదువుకోవాలని ఆసక్తి పెరగడమే కాకుండా, కొత్త విషయాలను నేర్చుకోవాలని, పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని తపన ఎక్కువ అవుతుంది. అది సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. గురువుల మరియు నిపుణుల సహాయ సహకారాలు వీరికి అందటం వలన విద్యలో మరింతగా రాణించడానికి ఉపయోగపడుతుంది. మే ఒకటి నుంచి గురువు గోచారం పదవ ఇంటికి మారటం వలన వీరు చదువు కంటే ఎక్కువ కీర్తి ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇవ్వడం చేస్తారు. దాని కారణంగా కొత్త విషయాలను నేర్చుకోకపోవడం మరియు పరీక్షల్లో అనుకున్న మార్కులు సాధించడానికి వివిధ రకాల మార్గాలను అనుసరించడం వలన వారు మంచి మార్కులు సాధించినప్పటికీ వారు తమ పేరు చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వారు సరైన మార్గంలో నడవటానికి వారి గురువుల లేదా పెద్దవారి సహాయం అవసరం అవుతుంది.
ఈ సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంటిలో ఉండటం వలన శని దృష్టి తొమ్మిది, ఒకటి, మరియు నాలగవ ఇంటిపై ఉంటుంది. దీని కారణంగా మే ఒకటి తర్వాత నుంచి చదువుపై ఆసక్తి తగ్గటం లేదా బద్ధకం పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా పరీక్షల్లో వారు అనుకున్న మార్కులు సాధించటానికి వారు సులువైన మార్గాలను వెతికే అవకాశం ఉంటుంది. దాని కారణంగా సమయాన్ని వ్యర్థం చేస్తారు. అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఇలాంటి ఆటంకాలకు నిరుత్సాహ పడకుండా ప్రయత్నం చేసినట్లయితే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఈ సంవత్సరంలో చదువు విషయంలో వీలైనంతవరకు నిజాయితీగా ఉండటం మరియు ఫలితం ఆశించకుండా చదవడం వలన విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించగలుగుతారు.
ఉద్యోగం కొరకు పోటీపరీక్షలు రాసేవారికి ఈ సంవత్సరం మే వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో రాసే పరీక్షల్లో వారు విజయం సాధించడమే కాకుండా వారి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అయితే మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఉద్యోగ విషయంలో తామనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమనే భయం కానీ, ఉద్యోగం రాదేమో అని నిరాశ కాని ఎక్కువ అవుతుంది. అయితే ఈ సమయంలో గురువు దృష్టి రెండవ మరియు, ఆరవ ఇంటిపై ఉంటుంది కాబట్టి వారు నిరాశ చెందకుండా ప్రయత్నించినట్లయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఈ సమయంలో నిజాయితీగా పట్టు వదలకుండా ప్రయత్నించడం మంచిది.
ఈ సంవత్సరం సింహ రాశిలో జన్మించిన వారు శనికి మరియు రాహువు కు ప్రధానంగా పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది. సంవత్సర ద్వితీయార్థంలో గురు గోచారం 10వ ఇంటిలో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి గురువుకు పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంట్లో ఉండటం వలన శని కారణంగా వృత్తి వ్యాపారాల్లో మరియు కుటుంబ విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చెడు ప్రభావం తగ్గటానికి శనికి పరిహారాలు ఆచరించండి. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం, శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. వాటితోపాటు హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్రం పారాయణం కానీ చేయటం మంచిది. దైవ సంబంధ పరిహారాలతో పాటుగా శని ప్రభావం తగ్గాలంటే వీలైనంతవరకు సేవ చేయడం మంచిది. శారీరక లోపాలున్న వారికి కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వలన కూడా శని ప్రభావం తగ్గుతుంది. శని మనలోని లోపాలని బయటపెట్టి వాటిని సరి దిద్దుకునేలా చేస్తాడు కాబట్టి శని ప్రభావము వలన వచ్చే సమస్యలను గురించి భయపడటంకంటే ఆ సమస్యకు కారణం ఏంటో కనుక్కోగలిగితే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.
ఈ సంవత్సరం మే ఒకటి నుంచి గురువు గోచారం పదవ ఇంటిలో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు స్తోత్ర పారాయణం చేయడం కానీ, గురు మంత్ర జపం చేయటం కానీ మంచిది. దీని వలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. వాటితోపాటు గురువులను, పెద్దలను గౌరవించడం, మరియు విద్యార్థులకు వారి చదువు ముందు సాగేలా వారికి తోచిన రూపంలో సాయం చేయడం మంచిది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 8వ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయటం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. దీనితోపాటు దుర్గా స్తోత్ర పారాయణం చేయటం లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయటం వలన కూడా రాహువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది.
Donec id elit non mi porta gravida at eget metus. Donec id elit non Vestibulum id ligula porta felis euism od semper. Nulla vitae elit libero
Call Us +91 9182346178
Send an Email on bssharma02@gmail.com
LIG -16 Baharath nagar Colony, Moosapet ,
Kukatpally (M), Medchal(Dt), Malkajgiri,
Hyderabad- 500018
Morning : 8:30 AM to 10:30 AM
Evening : 4:00 PM to 8:00 PM