+91 9182346178
2024 Telugu Rashi Phalalu (Rasi phalamulu)
విశాఖ 4వ పాదం(తో)
అనురాధ 4 పాదాలు (న, ని,ను, నే)
జ్యేష్ట 4 పాదాలు (నో, య, యి, యు)
వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో, నాలుగవ ఇంటిలో, రాహువు మీన రాశిలో, ఐదవ ఇంటిలో, కేతువు కన్యా రాశిలో, 11 ఇంటిలో ఉంటారు. మే ఒకటి వరకు గురువు మేషరాశిలో, ఒకటవ ఇంటిలో సంచరిస్తాడు ఆ తర్వాత సంవత్సరమంతా వృషభ రాశిలో, ఏడవ ఇంటిలో ఉంటాడు.
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మొదటి నాలుగు నెలలు వ్యాపార పరంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సమయం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. గురువు గోచారం ఆరవ ఇంటిలో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రం గానే ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే ఆగిపోవడం లేదా వాయిదా పడటం జరుగుతుంది. అలాగే వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధాలు లేకపోవడంతో వారి సహాయం సమయానికి అందక పోవచ్చు. ఈ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ మంచిది కాదు. శని దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మే 1 వరకు వ్యాపార సంబంధంగా ఏ పని ప్రారంభించిన అది మధ్యలో ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా మీ వినియోగదారులతో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వారి నుంచి సరైన సహకారం లభించకపోవడంతో మీరు అసహనానికి గురవుతారు. శని దృష్టి ఒకటో ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీలో అలసత్వం ఎక్కువ అవుతుంది. చాదస్తం కూడా పెరుగుతుంది. దాని కారణంగా ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం ఏడో ఇంటికి మారడంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి లగ్నంపై, లాభ స్థానంపై, మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపార పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయానిస్తాయి. మీరు గతంలో ఉన్న చీకాకులు కానీ, అసహనం కానీ తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు. ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ, ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తుంది. ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి కారణం అవుతుంది.
మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాన్ని ఇచ్చినప్పటికీ, ప్రతిసారి అదే రకమైన ఫలితం వస్తుందని భావించకూడదు. అయిదవ ఇంటిలో రాహువు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాన్ని ఇవ్వటం కానీ లేదా వ్యాపార పరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేయవచ్చు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవటం లో తొందరపడకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాతే వాటిని ఆచరణ రూపంలో పెట్టడం మంచిది. 11వ ఇంటిలో కేతు గోచారం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు వస్తాయి. అయితే వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికి వాడుతారు.
ఈ సంవత్సరం అంతా శని గోచారం నాలుగో ఇంటిలో ఉంటుంది కాబట్టి, మీరు విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించాల్సిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. దాని కారణంగా కొన్నిసార్లు మీరు మీ కుటుంబ సభ్యుల పైన కానీ, వ్యాపార భాగస్వాముల పైన కానీ, లేదా వినియోగదారుల పైన కానీ చికాకు పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో వీలైనంతవరకు ఓపికగా ఉండటం మంచిది.
వృశ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురువు గోచారం ఆరవ ఇంటిలో ఉండటం మరియు సంవత్సరమంతా శనికి గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు సంబంధం లేని పనుల విషయంలో కూడా మీరు బాధ్యత వహించే అవి పూర్తి చేయాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా ఆరవ ఇంటిలో గురువు గోచారం కారణంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు చాలా సార్లు మీకు ఇష్టం లేనప్పటికీ పనిచేయాల్సి వస్తుంది. ఈ పనుల కారణంగా మీకు ప్రత్యక్షంగా ఎటువంటి గుర్తింపు రానప్పటికీ ఒకవేళ మీరు వాటిని చేయకుండా వదిలేస్తే మీపై అధికారుల కోపానికి గురి అవ్వాల్సి వస్తుంది. శని దృష్టి మరియు గురువు దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మీరు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగ మార్పుకు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించవు. ఈ సమయంలో చాలాసార్లు మీ సహోద్యోగులు వారికి ఇచ్చిన పనులు పూర్తి చేయని కారణంగా, వారి పనులు కూడా మీరు చేయాల్సి రావచ్చు. ఈ సమయంలో మీరు మీ బాధ్యతలను తప్పించుకోకుండా పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు వదిలేయాలనుకున్నప్పటికీ తప్పనిసరిగా వాటిని పూర్తి చేయాల్సి వస్తుంటుంది. ఈ సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు మీ పనిని నిజాయితీగా పూర్తి చేయడం మంచిది. దాని కారణంగా భవిష్యత్తులో అది మీ పదోన్నతికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
మే ఒకటి నుంచి గురువు గోచారం ఏడవ ఇంటిలో అనుకూలంగా ఉండడంతో మీ ఉద్యోగంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. వేరే ఉద్యోగం రావటం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న దానిలో పదోన్నతి రావటం కానీ జరుగుతుంది. పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది మరియు మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మీరు బదిలీకి కానీ లేదా విదేశాల్లో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నించినట్లయితే మీకు అనుకూల ఫలితం లభిస్తుంది. గురు దృష్టి లాభ స్థానంపై మరియు మూడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో స్థాన చలనం ఉండే అవకాశం బలంగా ఉంటుంది. అయితే ఇది మీకు అనుకూల ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ సమయంలో మీరు చేసే పనులు మీతో పాటు ఇతరులకు కూడా లాభకరంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు. ముఖ్యంగా మీపై అధికారులు సహాయం కారణంగా మీరు మీ వృత్తిలో అభివృద్ధి చెందగలుగుతారు.
ఈ సంవత్సరం అంతా శని గోచారం నాలుగో ఇంటిలో ఉండటం వలన మీరు విశ్రాంతి లేకుండా పని చేయాల్సిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మీరు మీ కుటుంబంతో కూడా గడపడానికి సమయం దొరకనంత పని ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే ఒకటి వరకు ఈ విధమైన పని ఒత్తిడి ఉంటుంది. మే ఒకటి నుంచి గురువుగారు అనుకూలంగా ఉండటంతో పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది. శని దృష్టి ఒకటవ ఇంటిపై, ఆరవ ఇంటిపై మరియు పదవి ఇంటిపై ఉండటం వలన మీరు కొన్నిసార్లు పని విషయంలో అలసత్వాన్ని, చికాకును కలిగి ఉండే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు చేయాల్సిన పని చేయకుండా వాయిదా వేయడం వలన, పని తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వీలైనంతవరకు మీరు చేయాల్సిన పనులను సమయానికి పూర్తి చేయడం వల్ల మీకు భవిష్యత్తులో వృత్తి పరంగా వచ్చే సమస్యలు రాకుండా ఆపిన వారవుతారు. ఈ సంవత్సరం మీరు చేసిన పనికి గుర్తింపు రావాలని, నలుగురు మెచ్చుకోవాలని చూడకండి. దాని కారణంగా మీరు అనుకున్న విధంగా గుర్తింపు రానట్లయితే నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి, మీరు నిజాయితీగా చేసిన ప్రతి పనికి అనుకూలమైన ప్రతిఫలం లభిస్తుంది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఐదవ ఇంటిలో, కేతు గోచారం 11 ఇంటిలో ఉంటుంది కాబట్టి మీ ఆలోచనలు, మరియు మీ సృజనాత్మకత కొన్నిసార్లు మంచి ఫలితాలను మరి కొన్నిసార్లు అంతగా అనుకూలించని ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మీ ఆలోచనలు ఎదుటివారు మెచ్చుకోవాలని లేదా ఆచరణలో పెట్టాలని ఆశించకండి.
వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురువు గోచారం ఆరవ ఇంట్లో ఉండటం వలన ఆదాయం ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ, అప్పులు కానీ తిరిగి తీర్చడానికి ఖర్చు అవుతుంది. గురువు దృష్టి 12వ ఇంటిపై ఉండటం వలన శుభకార్యాల కొరకు లేదా దానధర్మాల కొరకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు చేస్తారు. వృత్తి కారణంగా లేదా వ్యాపారం కారణంగా ఈ సమయంలో ఆదాయం ఎక్కువగా ఉండకపోవటం జరుగుతుంది. అవసరాలకు తగినంత డబ్బు మాత్రమే రావటం వలన పొదుపు చేయలేక పోతారు. ఈ సమయంలో స్థిరచరాస్తులు కొనుగోలు చేయటం అంతగా అనుకూలించదు. గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో స్థిరచరాస్తులు కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు సూర్య గోచారం మరియు కుజ గోచారం అనుకూలంగా ఉన్న నెలలో చేయటం మంచిది. ముఖ్యంగా రిస్క్ తో కూడిన పెట్టుబడులు ఈ సమయంలో అసలు చేయకూడదు. ఈ సమయంలో గృహ లేదా వాహన సంబంధ మరమ్మతులకు కూడా మీరు డబ్బు ఖర్చు చేస్తారు.
మే ఒకటి నుంచి గురువు గోచారం ఏడవ ఇంట్లోకి మారడంతో ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం ప్రారంభమవుతుంది. మీ వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరగడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే స్థిరాస్తుల ద్వారా కానీ, గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ ఈ సమయంలో ఆదాయం లభిస్తుంది. గురువు దృష్టి లాభ స్థానంపై ఉండటం వలన మీరు మీ వృత్తి ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ పూర్తిగా చెల్లించగలుగుతారు. డబ్బు పొదుపు చేయగలుగుతారు. గురు దృష్టి లగ్నంపై మరియు మూడవ ఇంటిపై ఉండటం వలన మీరు చేసే ఆలోచనలు, పనులు మీకు లాభాలను ఇస్తాయి. ఇల్లు కానీ వాహనం కానీ కొనాలనుకునేవారు ఈ సమయంలో వాటిని తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు వ్యాపార అభివృద్ధి కొరకు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు తగినంత డబ్బు చేతికి అందుతుంది.
ఐదవ ఇంటిలో రాహు గోచారం మరియు నాలుగవ ఇంటిలో శని గోచారం కారణంగా ఈ సంవత్సరం రిస్క్ తో కూడుకున్న పెట్టుబడులు కానీ, ఇతరుల మాటలు నమ్మి లేదా వారి ప్రలోభాలకు లొంగిపోయి చేసే పెట్టుబడులు కానీ నష్టాల్ని మిగిల్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. నాలుగో ఇంట్లో శని మీరు అవసరానికి ఉపయోగపడని లేదా ఇతరులు ఉపయోగించి వదిలేసిన వాహనాలు కానీ, ఇండ్లు కానీ కొనేలా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గురు బలం లేని సమయంలో ఇటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. సంవత్సరం అంతా కేతు గోచారం 11వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఒక్కోసారి అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ అలా వస్తాయని చెప్పి రిస్క్ తీసుకొని ప్రతి దానిలో పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.
వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమంగా ఉంటుంది. మే ఒకటి వరకు గురు గోచారం ఆరవ ఇంట్లో ఉండటం, మరియు శని రాహువుల గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఈ సమయంలో కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబసభ్యుల మధ్యన సరైన అవగాహన లేకపోవడం, ఇంటి పెద్దవారి ఆరోగ్య సమస్యల కారణంగా ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండకపోవచ్చు. నాలుగో ఇంట్లో శని గోచారం కారణంగా మీరు కొంతకాలం ఉద్యోగరీత్యా కాని లేదా ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. గురుదృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ పెద్దలు లేదా శ్రేయోభిలాషుల సహకారంతో ఆ సమస్యల నుంచి బయట పడగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం కానీ, పెద్దల ఆరోగ్యం కానీ ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఈ సమస్యలు కొంతకాలమే ఉంటాయి కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐదవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీకు, మీ పిల్లలకు మధ్య సరైన అవగాహన ఉండకపోవటం కానీ లేదా మీకు మీ పెద్దలకు మధ్య మనస్పర్థలు రావడం కానీ జరుగుతుంది. అయితే చాలావరకు ఈ సమస్యలు ఇతరులు మీ కుటుంబ విషయాల్లో కల్పించుకోవడం వల్ల లేదా మిమ్మల్ని లేదా మీ కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టడం వల్ల వచ్చేవి అవుతాయి.
మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో ఉండే సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి. ముఖ్యంగా గురువు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వలన గత కొంతకాలంగా మీలో ఉన్న చికాకు కానీ, కోపం గానీ తగ్గి ప్రశాంతంగా మారతారు. అలాగే మీతో మీ కుటుంబ సభ్యులకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యం మెరుగు పడటం అలాగే బంధువులు లేదా మిత్రులు సహాయంతో మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిచేయ గలగటం వలన కుటుంబంలో ప్రశాంత వాతావరణ ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు కొత్త ఇంటికి మారటం కానీ, కొత్త ప్రదేశానికి మారడం కానీ జరుగుతుంది. ఏడవ ఇంటిపై గురువు సంచారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మీకున్న సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా మీ జీవిత భాగస్వామికి వారి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధ్యమవుతుంది. దాని కారణంగా మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగటం వల్ల బంధుమిత్రులు రావడం మరియు కుటుంబమంతా ఆనందంగా ఉండటం జరుగుతుంది.
మీరు అవివాహితులు అయ్యుండి వివాహం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. మీరు వివాహితులు అయ్యుండి సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు సంతాన భాగ్యం కలుగుతుంది. అయితే ఐదవ ఇంటిలో రాహు గోచారం కారణంగా పిల్లల విషయంలో కొన్ని సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. వారు మొండిగా మీ మాట వినకుండా తయారవడం కానీ లేదా వారిలో కోపం, ఆవేశం పెరగడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో వారిపై కోపించకుండా వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని మెలగటం మంచిది.
వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. మొదటి నాలుగు నెలలు గురువు, శని, మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన, లేదా విష జ్వరాలకు సంబంధించిన, లేదా అలర్జీలకు సంబంధించిన, లేదా అపరిశుభ్ర ఆహారం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో గురు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
నాలుగో ఇంటిలో శని గోచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి పని ఒత్తిడి కారణంగా, మరియు అధికంగా ప్రయాణాల కారణంగా నడుము, ఎముకలు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం వలన ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ సమయంలో మీ రోగ నిరోధక శక్తి పెరగటానికి యోగా, ప్రాణాయాయం లాంటి పద్ధతులను పాటించడం మరియు వీలైనంత తక్కువ సమయం ప్రకృతిలో గడపడం మంచిది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన మీరు హృదయ సంబంధ, లేదా ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. చాలావరకు ఈ సమస్యలు మీ నిర్లక్ష్యం కారణంగా మరియు మీరు సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండకపోవటం వలన వచ్చేవి అవుతాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో గురు,శనుల గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
సంవత్సరం అంతా కేతు గోచారం, మే ఒకటి నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒకటవ ఇంటిపై గురువు దృష్టి కారణంగా మీలో రోగనిరోధక శక్తి పెరగడం వల్ల మీరు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ సమయంలో మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. మరియు ఇతరులు కూడా ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి తగిన సలహాలను సూచనలు ఇచ్చి ప్రోత్సహిస్తారు.
వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే ఒకటి వరకు గురువుతో పాటు, శని మరియు రాహుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో చదువులో ఏకాగ్రత తగ్గటం మరియు ఆటంకాలు ఏర్పడటం జరగవచ్చు. ముఖ్యంగా విద్యార్థుల్లో చదువు గురించి అలసత్వం పెరగటం మరియు, పరీక్షల విషయంలో అహంకారం ఎక్కువ అవ్వడం జరుగుతుంది. తమలాగా ఎవరూ చదవరు అనే అహంభావ ధోరణి కానీ, ఎక్కువ శ్రమ చేయకున్నా పరీక్షల్లో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతామని నిర్లక్ష్య ధోరణి ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా వారు చదువు నిర్లక్ష్యం చేస్తారు.
ఈ సంవత్సరం శని గోచారం నాలుగవ ఇంటిలో ఉండటం వలన విద్యార్థులు చదివే విద్యాలయంలో కానీ, చదివే ప్రాంతంలో గాని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. చదువు నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా వేరే విద్యాలయాలకు వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా ప్రాథమిక విద్యలో ఉన్న విద్యార్థులకు ఈ విధమైన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల కారణంగా కానీ లేదా వారి వ్యక్తిగత ఆసక్తి వల్ల కానీ ఇది జరుగుతుంది. అయితే కొత్త ప్రదేశంలో ఇమడలేక లేక కొంతకాలం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం రాహు గోచారం ఐదవ ఇంటిలో ఉండటం వలన మే 1 వరకు పరీక్షల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తమ నిర్లక్ష్యం కారణంగా వారు పరీక్షలను సరిగా రాయకపోవడం కానీ లేదా పరీక్షల సమయంలో ఏదో ఒక సమస్య వచ్చి పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయలేక పోవడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంతవరకు తల్లిదండ్రులు, లేదా గురువులు వారిని ప్రోత్సహించి సరైన మార్గంలో పెట్టడం మంచిది.
సంవత్సరం అంతా కేతువు గోచారం 11వ ఇంటిలో ఉండటం మరియు, మే ఒకటి నుంచి గురు గోచారం ఏడవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన చదువు విషయంలో ఉన్న సమస్యలు తొలగిపోయి విద్యార్థులు ఏకాగ్రతగా చదవగలుగుతారు. గతంలో ఉన్న నిర్లక్ష్య ధోరణి కానీ, బద్ధకం కానీ తొలగిపోయి ఉత్సాహంగా చదవడం మరియు పరీక్షలు రాయడం చేస్తారు. ఒకటో ఇంటిపై, మూడవ ఇంటిపై, మరియు 11 ఇంటిపై గురువు దృష్టి ఉండటం వలన వారిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలనే పట్టుదల పెరుగుతుంది. దానికి తగిన ప్రయత్నం కూడా చేయటం వలన వారు అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు.
ఉద్యోగం కొరకు పోటీ పరీక్షల రాస్తున్నవారికి ఈ సంవత్సరం ప్రథమార్ధం సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో వారు అనుకున్న ఫలితాన్ని పొందుతారు. మే ఒకటి వరకు గురువుతో పాటు, శని మరియు రాహువుల గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఈ సమయంలో వీరు కష్టపడి చదవాల్సి ఉంటుంది. వారు ఏకాగ్రతను భంగం కలిగించే వ్యక్తులు, విషయాలు ఈ సమయంలో ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి వాటికి లొంగకుండా తమ లక్ష్యం గురించి ప్రయత్నించడం మంచిది. మే ఒకటి నుంచి గురువు గోచారం బాగుంటుంది కాబట్టి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు.
వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం గురువుకు, శనికి, మరియు రాహువుకు పరిహారాలు ఆచరించాలి. 4వ ఇంటిలో శని గోచారం కారణంగా విద్య, మరియు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి పరిహారాలు చేయడం వలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. దీనికిగాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం, శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. వీటితోపాటు హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్రం పారాయణం కానీ చేయటం మంచిది. దైవ సంబంధ పరిహారాలతో పాటుగా శని ప్రభావం తగ్గాలంటే వీలైనంతవరకు సేవ చేయడం మంచిది. శారీరక లోపాలున్న వారికి కానీ, అనాధలకు కానీ, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వలన కూడా శని ప్రభావం తగ్గుతుంది. శని మనలోని లోపాలని బయటపెట్టి వాటిని సరిదిద్దుకునేలా చేస్తాడు కాబట్టి శని ప్రభావము వలన వచ్చే సమస్యలను గురించి భయపడటం కంటే ఆ సమస్యకు కారణం ఏంటో కనుక్కోగలిగితే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.
ఈ సంవత్సరం మే ఒకటి వరకు గురువు గోచారం ఆరవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు స్తోత్ర పారాయణం చేయడం కానీ, గురు మంత్ర జపం చేయటం కానీ మంచిది. దీని వలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. వీటితోపాటు గురువులను, పెద్దలను గౌరవించడం, మరియు విద్యార్థులకు వారి చదువు ముందు సాగేలా వారికి తోచిన రూపంలో సాయం చేయడం మంచిది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 5వ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయటం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. దీనితోపాటు దుర్గా స్తోత్ర పారాయణం చేయటం లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయటం వలన కూడా రాహువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది.
Donec id elit non mi porta gravida at eget metus. Donec id elit non Vestibulum id ligula porta felis euism od semper. Nulla vitae elit libero
Call Us +91 9182346178
Send an Email on bssharma02@gmail.com
LIG -16 Baharath nagar Colony, Moosapet ,
Kukatpally (M), Medchal(Dt), Malkajgiri,
Hyderabad- 500018
Morning : 8:30 AM to 10:30 AM
Evening : 4:00 PM to 8:00 PM